ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అదినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ కుమ్మేశారు. ఇటీవల జగన్ .. తన పార్టీ నేతలతో “నువ్వే మా నమ్మకం జగన్” అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అంటించాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే.. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు కామెంట్లు చేశారు. “సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్‌లు వేస్తాడట.. ‘నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం’ అని ప్రజలు అంటున్నారు” అని చంద్రబాబు సటైర్లు వేశారు.
ప్రజల కష్టాలకు ప్రధాన కారకుడైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్ వేస్తాడట అని వ్యాఖ్యానించారు. సైకో జగన్‌ను ఇంటికి పంపేందుకు వీర నారీమణుల్లా మహిళలు పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరి.. సీఎం జగన్‌పై ఆయన విరుచుకుపడ్డారు.
ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన చెత్త సైకో ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబు అన్నారు. జగన్‌రెడ్డి ఇచ్చే పది రూపాయలు మాత్రమే కనిపిస్తోంది కానీ, దోచుకునే రూ.50 గురించి తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది తెలుసుకున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను, నేతలను కూడా మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వరని అన్నారు. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా.. ప్రజల ముఖాలకు కూడా రంగులు వేసేస్తారని.. జగన్‌పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు.
వారిని ఆదుకుంటా!
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని చంద్రబాబు అన్నారు. నిర్వాసితులకు సంబంధించి వెయ్యి ఎకరాల పరిహారాన్ని బోగస్ పట్టాలతో నేతలు ఆభూములు సొంతం చేసుకుంటున్నారని అన్నారు. దీనిపై తాను అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ జరిపిస్తామని అన్నారు. ప్రజాధనాన్ని మింగేస్తున్నారని వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల భూములు సర్వే చేసి .. జగన్ తన బొమ్మలు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అడుగడుగునా ఘన స్వాగతం
తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. క్రేన్ ద్వారా ప్రతి సెంటరులో భారీ గజమాలలతో మాజీ సీఎంకు స్వాగతం పలికారు. మధురపూడి ఎయిర్‌పోర్టు నుంచి బూరుగుపూడి, కోరుకొండ మీదుగా గుమ్మళ్లదొడ్డికి చేరుకున్న చంద్రబాబుకు మహిళలు హారతులు పట్టారు.