సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. వివేక హత్య పై కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. వివేకానందరెడ్డిని చంపితే.. జగన్‌కు, ఆయన కుటుంబానికి వచ్చే లాభమేంటని ప్రశ్నించారు.
వైఎస్ వివేకాను చంపితే దినం ఖర్చులు.. కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభం లేదని నాని వ్యాఖ్యానించారు. వివేకా చనిపోతే ఆస్తులు ఎవరికెళ్లాయి.. అని ప్రశ్నించారు. వివేకా చనిపోతే జగనుకేమైనా ఆస్తులొచ్చాయా..? అని నిలదీశారు. జగనుతో ఏనాడూ వివేకానందరెడ్డి కలిసి నడిచిన పరిస్థితి లేదన్నారు. విజయమ్మ మీద కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేశారని అన్నారు. జగన్ కుటుంబం సర్వనాశనం కావాలని కోరుకునే వ్యక్తులు వైఎస్ వివేకా ఫ్యామిలీలోనే ఉన్నారని అన్నారు.
వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబమే జగన్ వెంట నడిచిందని నాని చెప్పారు. వివేకానందరెడ్డి బతికి ఉన్నప్పటికీ.. భాస్కర్ రెడ్డి కుటుంబానికే కడప ఎంపీ టికెట్‌ను ఇచ్చేవారని తెలిపారు. ఎన్నికల్లో టిక్కెట్ ఎవరికివ్వాలో జగన్ ఇష్టంపైనే ఆధారపడుతుందన్నారు. మామను చంపి పదవి తీసుకున్నది చంద్రబాబేనని నాని విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చంద్రబాబు మరోసారి చూస్తారని వ్యాఖ్యానించారు.
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేస్తున్న యువగళంపైనా నాని విమర్శలు గుప్పించారు. నారా లోకేష్‌కు ఎన్టీఆర్ గొంతు రావడం ఏంటని ప్రశ్నించారు. లోకేష్‌కు వచ్చింది ఖర్జూర నాయుడు గొంతై ఉంటుందన్నారు. ఖర్జూర నాయుడు బస్టాండులో జేబులు కొడుతూ తిరిగేవాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ బతుకుంటే లోకేష్ మాటలు విని ఆత్మహత్య చేసుకుని ఉండేవారని నాని పేర్కొన్నారు. “జగనాసుర రక్త చరిత్ర ఎవరు చదువుతారు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా ఉందనే ఐ-టీడీపీ పెట్టారు. బుక్స్ చదువుతున్నారంటే పేపర్ టీడీపీ అని రాయండి” అని ఎద్దేవా చేశారు.