పవన్ కల్యాణ్‌ను జీవీఎల్ ఇరుకునపెట్టారా?

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రాయానికి, కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కోరడంతో జనసేనలో గుబులు మొదలైంది. ఏపీలో కాపుల ఓట్లను కన్సాలిడేట్ చేసే పనిలో పూర్తిగా తలమునకలైన జనసేన ముఖ్యనేతలకు జీవీఎల్ తాజా డిమాండ్ ఇరుకునపెట్టినట్లయింది. పవన్ కల్యాణ్ 2014 నాటి తన తటస్ఠ వైఖరిని వీడి కాపులను ఓన్ చేసుకునే దిశగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సమకాలీన కాపులనే లెక్కలోకి తీసుకుంటున్నా వంగవీటి రంగా వంటి కాపు దిగ్గజాలను వాడుకోవడం లేదు. ఒకట్రెండు సందర్భాలలో రంగా ప్రస్తావన తెచ్చినా అదేదో యథాలాపంగా జరిగింది మాత్రమే. అంతేకాదు.. రంగాను కాపులు కాపాడుకోలేకపోయారని స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఓసారి విమర్శల పాలయ్యారు.

తాజాగా జీవీఎల్ డిమాండ్‌తో పవన్ నుంచి కూడా అలాంటి స్పందనను ఆశిస్తుంది కాపు వర్గం. కానీ, పవన్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి డిమాండ్ చేసేలా లేరు. పైగా రంగా హత్యకు కారణమైన పార్టీగా ఆరోపణలు ఎదుర్కొనే తెలుగుదేశంతో ఆయన పొత్తు పెట్టుకునే దిశగా వెళ్తున్న వేళ జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పవన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారనుందంటున్నారు విశ్లేషకులు.

కృష్ణా జిల్లాకు ఇప్పటికే ఎన్టీఆర్ పేరు ఉంది. దీంతో కాపులను ఊరడించేందుకు జీవీఎల్‌కు మద్దతుగా పవన్ కనుక గొంతు విప్పితే టీడీపీకి నచ్చదు. అలా అని బీజేపీ నేత జీవీఎల్ డిమాండ్ చేసినప్పుడు దానిపై స్పందించకపోతే కాపులకు నచ్చదు. దీంతో పవన్ ఇరకాటంలో పడినట్లే కనిపిస్తోంది.

నిజానికి జీవీఎల్ ఉద్దేశం కూడా పవన్‌ను ఇరకాటం పెట్టడానికే అనిపిస్తోంది. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ పవన్ తెలుగుదేశం పార్టీలో కలిసి నడిచేందుకు మొగ్గు చూపతుండడం.. బీజేపీని, ఆ పార్టీ నేతలను అస్సలు పట్టించుకోకపోవడంతో జీవీఎల్ ఈ ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాల పేర్లు మార్పు రాష్ట్రం పరిధిలోనూ ఉంటుంది. రాష్ట్రమే జిల్లా పేరు మార్చి కేంద్రానికి సమాచారం ఇస్తే సరిపోతుంది. అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసినా సరిపోతుంది. కానీ, అలా చేస్తే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టినట్టవుతుంది. అందుకే జీవీఎల్ ఇలా రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

రాజ్యసభలో వంగవీటి ప్రస్తావన తెచ్చిన జీవీఎల్ తెలుగు రాష్ట్రాలలో రంగా అంటే తెలియని వారు ఉండరని… బడుగు బలహీనవర్గాలు రంగాను దేవుడిలా చూస్తాయని అన్నారు. రంగా రాజకీయ శక్తిగా ఎదుగుతున్న సమయంలో 1986 డిసెంబరులో ఆయన్ను కొందరు చంపేశారంటూ పాతగాయాన్ని కదిపారు జీవీఎల్. కాపునాడు సభల సమయంలో ఆయన్ను చంపేశారని.. ఆయన చనిపోయి 36 ఏళ్లవుతున్నా జనం ఇప్పటికీ మర్చిపోలేదని జీవీఎల్ అన్నారు. మొత్తానికి రంగా అంశాన్ని ఏకంగా పార్లమెంటులో ప్రస్తావించడం వెనుక వ్యూహం జీవీఎల్‌దేనా లేదంటే బీజేపీ పెద్దలదా అనేది తెలియాల్సి ఉంది.