“ఇప్పటి వరకు ఏపీలో సీఎం జగన్.. వైసీపీ నాయకులు చేసిన పాలన వేరు. ఇక నుంచి చేయబోయే పాలన వేరు! ఎందుకంటే.. ఇప్పుడు గవర్నర్ మారిపోయారు” ఇదీ.. తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. నిజమే! అన్నింటికీ లెక్కలు అడగరనే ధీమా.. తాను ఏం చేసినా.. ఫర్వాలేదనే పరిస్థితి ఏపీ సీఎంలో ఉన్న మాటను తరచుగా ప్రతిపక్షాలు చెబుతూ ఉంటాయి. దీనికి కారణం.. గవర్నర్ పెద్దగా పట్టించుకోకపోవడమేనని కూడా చెబుతుంటాయి.
అయితే.. ఇప్పుడు పరిస్థితి అలా ఉండబోదని అంటున్నారు. సుప్రీంకోర్టులో పనిచేసి.. నిక్కచ్చిగా వ్యవహరించిన.. రాజ్యాంగ కోవిదుడు ఇప్పుడు గవర్నర్‌గా వస్తుండడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే.. వైసీపీలోనూ తాజాగా గవర్నర్ మార్పుపై ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం. ఎన్నికలకు ముంగిట జరిగిన ఈ భారీ మార్పు.. కేంద్రం వేసిన రాజకీయ పాచికగానే భావిస్తున్నారు. ఇటీవల పార్లమెంటులోను.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అమరావతిపై అఫిడవిట్‌లోనూ కేంద్రం ఒకరకంగా.. జగన్‌ను ఇరుకున పెట్టిందని అంటున్నారు.
అమరావతి విషయంలో తాము విభజన చట్టాన్నే అనుసరించామని.. అసలు మూడు రాజధానుల విష యాన్ని తమకు వైసీపీ ప్రభుత్వం ఎక్కడా చెప్పనేలేదని.. కేంద్రం ఇటు పార్లమెంటులోనూ.. అటు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లోనూ ప్రస్తావించింది. దీంతో జగన్ సర్కారుకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. ఒకవైపు విశాఖపట్నానికి వెళ్లిపోతున్నామని.. త్వరలోనే అక్కడ రాజధాని ఏర్పాటవుతుందని.. సీఎం జగన్ ఢిల్లీలో చెప్పడం.. ఆ వెంటనే కేంద్రం ఇలా .. చెప్పడం రాజకీయంగా జగన్‌కు ఇబ్బందిగా మారింది.
ఇక, ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయం తమురుకు వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా గవర్నర్ మార్పు మరింతగా వైసీపీని కలవరపాటుకు గురిచేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా ఉన్నత విద్యావంతుడే కాకుండా.. రాజ్యాంగం తెలిసిన న్యాయమూర్తిగా ఉన్న గవర్నర్‌తో జగన్‌కు ఇప్పటివరకు ఉన్న పరిస్థితి భవిష్యత్తులో ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఇలా చేసిందా.. లేక ఏం జరిగింది? జగన్‌కు మోడీకి బెడిసి కొట్టిందా? అనే కోణంలోనూ చర్చ సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates