వ్యక్తిగత జీవితంలో అయినా.. వృత్తిగత జీవితంలో అయినా.. ఇప్పుడు ఎవరూ సస్పెన్స్ కోరుకోవడం లేదు. ఏ సమస్య అయినా.. ఏ విషయం అయినా..ఫటాఫట్ తేలిపోవాలి.. ధనాధన్ సాకారం అయిపోవాలి. మరి వీటికే ఇంత ఉంటే.. మరి రాజకీయాల్లో మాత్రం నాయకులు ఎంతసేపని ఓపికగా ఉంటారు? ఎంతగా అని ఓర్పుగా ఉంటారు? కుదరదని.. స్పష్టం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు సెగ పెడుతుండగా.. పార్టీ నేతల్లో బీపీని పెంచేస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. పలువురు సీనియర్లు.. వచ్చే ఎన్నికల్లో తమ తమ వారసులను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. వీరికి గతంలో చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు. వచ్చేఎన్నికల్లో ఖచ్చితంగా సీట్లు ఖాయం.. మీరు రెడీగా ఉండండి.. బాదుడే బాదుడు కార్యక్రమాలు చేయండి.. అని చెప్పారు. దీంతో వారు రెచ్చిపోయారు. అధికారపార్టీపై విరుచుకుపడ్డారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు సమయం వచ్చేసింది.
మరి చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు పార్టీలోని కీలక నేతలకు బీపీ పెంచేస్తున్న విషయం. ఉదాహరణకు గుంటూరు జిల్లాను తీసుకుంటే.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వారసుడు రంగారావు, శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ.. వంటివారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఆదేశం కోసం.. ఎదురు చూస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదీ లేనిదీ చెప్పడం లేదు.
పోనీ.. ఆయా నియోజకవర్గాల్లో వేరే వారిని ప్రకటించారా? అలా చేస్తే.. తమ దారి తాము చూసుకుంటామని కూడా నేతలు చెబుతున్నారు. ఇదీ చేయరు. దీంతో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో నాయకుల బీపీ జోరుగా పెరిగిపోతోంది. ఎన్నికలకు ఆరు మాసాల ముందు ప్రకటిస్తే..తమ పరిస్థితి ఏంటి? అనేది వీరి ఆవేదనగా ఉంది. మరి ఇప్పటికైనా.. చంద్రబాబు ఏదో ఒకటి తేల్చేస్తే.. బెటర్ కదా? అంటున్నారు నాయకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.