టైమ్‌కే ఎలక్షన్ అంటున్న జగన్

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు 14 నెలలే ఉందని, గడప గడపకు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు ఆయన హితబోధ చేశారు. కార్యక్రమాన్ని ఆషామాషీగా నిర్వహిస్తే ఊరుకోబోనని కుండబద్దలు కొట్టారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని కొందరు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తిరగని వారు, తక్కువ రోజులు తిరిగిన వారికి క్లాస్‌ తీసుకున్నారు. కొడాలి నాని, ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్.. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని వెల్లడించారు. వరెస్ట్ పెర్ఫార్మెన్స్ జాబితాలో 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని జగన్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

మార్చి 18 నుంచి ‘మా భవిష్యత్‌ నువ్వే జగన్’ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈలోగా కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు.

సీఎం జగన్ ఈ మధ్య కాలంలో తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఆయన తీవ్ర అసహనంగా కనిపించారని అంటున్నారు. ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లకుండా మొహం చాటేస్తున్నారని ఆయన ఆగ్రహం చెందుతున్నారు. పీకే టీమ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జగన్ అన్ని విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది.. మరి ఎమ్మెల్యేలు దారికి వస్తారో లేదో చూడాలి.