ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడా ?

శ్రీలంకలో తమిళుల కోసం 1980లలో ఏర్పడిన మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ). తమిళనాడులో తమిళ వీరాభిమానులంతా ఎల్టీటీఈకి మద్దతిచ్చేవారు. 1991 ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎల్టీటీఈ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినా తమిళ అభిమానులు మాత్రం ఆ ఉగ్రవాద సంస్థకు మద్దతిస్తూనే ఉన్నారు..

ఇప్పుడు నెడుమారన్..

తమిళనాడులో నెడుమారన్ అనే నాయకుడు ఉన్నారు.తొలినాళ్లలో ఆయన కాంగ్రెస్ లో ఉండే వారు. తర్వాత తమిళ జాతీయవాదిగా చెప్పుకుంటూ స్వచ్ఛంద సంస్థను నడుపుకుంటున్నారు. ఇప్పుడాయన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడని చెబుతున్నారు. నిజానికి 2009 మేలో ప్రభాకరన్ ను చంపేసినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఎల్టీటీఈ మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లు వెల్లడించింది. అయినా తమిళనాడులో అప్పుడప్పుడు ప్రభాకరన్ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా నెడుమారన్ ఒక ప్రకటన చేస్తూ ప్రభాకరన్ బతికే ఉన్నాడని చెప్పారు. పైగా ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నానన్నారు…

తమిళనాడులో జోష్

నెడుమారన్ ప్రకటనతో తమిళనాడులో మళ్లీ జోష్ కనిపిస్తోంది. నెడుమారన్ ప్రకటనను కొందరు తమిళ జాతీయవాదులు స్వాగతించారు. నిజం కాకపోతే నెడుమారన్ అలాంటి మాటలు చెప్పరని విశ్లేషించారు. నెడుమారన్ నిత్యం ఎల్టీటీఈ కేడర్ తో టచ్ లో ఉంటారని చెప్పుకుంటున్నారు. దీనిపై అప్పుడే టీవీ చర్చలు మొదలు పెట్టేశారు. అదే మరి తమిళనాడు అంటే..