స‌జ్జ‌ల కుమారుడి డామినేష‌న్ కూడా పెరిగిపోయిందా…!

ఏపీ అధికార పార్టీలో నెంబ‌ర్ 2గా ఉన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు విష‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రు లు తీవ్ర అసంతృప్తితో ఉన్న విష‌యం తెలిసిందే. ఒక‌రిద్ద‌రు అయితే బాహాటంగానే ఈ విష‌యాన్ని చెప్పు కొచ్చారు. త‌మ‌కు ఎలాంటి స్వేచ్ఛ లేద‌ని.. తాము ఏం చేయాల‌న్నా.. కాళ్లు చేతులు క‌ట్టేసిన‌ట్టు ఉంటోం ద‌ని కూడా వారు వాపోయారు. దీనికి కార‌ణం.. స‌ల‌హాదారు స‌జ్జ‌లేన‌న్న ఎమ్మెల్యేల అభిప్రాయం.

ఇటీవ‌ల ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఒక నాయ‌కుడు.. “మేం ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే. మా వెనుక కూడా అనేక మంది పెద్ద‌లు ఉన్నారు. వారు క‌దా.. మ‌మ్మ‌ల్ని న‌డిపిస్తోంది!” అని ఒకింత అస‌హ‌నం వ్య క్తం చేశారు. అయితే.. ఆయ‌న‌పైకి చాలా కూల్‌గానే అన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌లో మాత్రం దాగి ఉన్న కోపం వేరు. ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ.. సీఎం ను క‌ల‌వ‌లేరు. స్వేచ్ఛ‌గా మాట్లాడ‌లేర‌నే బాధ‌.. ఆవేద‌న వారిలో ఉంది.

దీంతో చాలా మంది నాయకులు అస‌లు తాడేప‌ల్లి విష‌యాన్నే మ‌రిచిపోయారు. ఏమైనా చెప్పాల‌ని అను కున్నా.. మౌనంగా ఉంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం బాహాటంగా బ‌య‌ట ప‌డుతున్నారు. ఒక‌వైపు ఈ ప‌రిస్థితి ఉంటే..ఇప్పుడు స‌జ్జ‌ల కుమారుడు రాఘ‌వ‌రెడ్డి కేంద్రంగా మ‌రో రాజ‌కీయం వెలుగు చూస్తున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ప్ర‌స్తుతం వైసీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌గా ఉన్న స‌జ్జ‌ల రాఘ‌వ‌రెడ్డిపై.. పార్టీలో అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లు పెరుగుతున్నాయి.

ఇంత‌కు ముందు.. సోష‌ల్ మీడియాను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు నాయ‌కులు.. ఎమ్మెల్యేలు కూడా ఎంతో కృషి చేసేవారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క్ర‌మాల‌ను కూడా ఈ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ పోస్టులు త‌గ్గిపోయాయి. పైగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏం జ‌రుగుతోందో.. ఆయ‌న వ‌లంటీర్ల ద్వారా ముందుగానే తెలుసుకుని.. నియంత్రిస్తున్నార‌ని అంటున్నారు. అంటే.. ఎమ్మెల్యేలు ఏం చేసినా.. ఇక‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కాద‌న్న‌మాట‌. దీంతో ఎమ్మెల్యేలు.. వ‌గ‌రుస్తున్నారు. ఇది కూడా త‌మ‌కు ఇబ్బందేనా? అని వాపోతున్నారు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.