రా.. రా.. రాజేందర్….

ఈటల రాజేందర్ చాలా రోజులుగా ఫైర్ బ్రాండ్. హుజురాబాద్ వీరుడిగా అందరికీ పరిచితుడు. కేసీఆర్ తో విభేదించి మంత్రి పదవినే వదులుకున్న నేత. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా ఓడించలేని నాయకుడాయన. బీజేపీలో కూడా రాజేందర్ ఉక్కపోతను ఎదుర్కొంటున్నారన్న చర్చ జరుగుతోంది. రాజేందర్ పయనమెటు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసెంబ్లీలో పదే పదే ప్రస్తావన

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఈటల పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించారు. ఈటల అడిగిన ప్రశ్నలను నోట్ చేసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని హరీష్ రావును ఆదేశించారు. ఈటల బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సంఘటనలను గుర్తు చేశారు. సన్నబియ్యంపై నాడు ఈటల సలహా నుంచి ఇప్పుడు డైట్ ఛార్జీల వరకు అన్ని అంశాలను పరిగణిస్తామన్నారు. ఈటలకు అది తెలుసు, ఈటలకు ఇది తెలుసు. ఈటలకు అన్ని తెలుసు అని కేసీఆర్ అన్నారు. సమస్య ఉంది కాబట్టే ఈటల మాట్లాడుతున్నారని ఆకాశానికెత్తేశారు. మొత్తం మీద కేసీఆర్ స్వయంగా 18 సార్లు ఈటల పేరు ప్రస్తావించారు.

ఈటల కావాలనుకుంటున్నారా..

బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటలను మళ్లీ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతోందన్న చర్చ నడుమ కేసీఆర్ ఆయన్ను పొగడటం ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి ప్రస్తావనే వచ్చింది. మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కేసీఆర్ ఆఫరిచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పుడు ఆ వార్తలను ఖండించిన ఈటల, అదంతా కేసీఆర్ కుటిల గేమ్ ప్లాన్ అని ఆరోపించారు.

ఇప్పుడూ అదే మాట

ఈటల ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని ఈటల అంటున్నారు. కేసీఆర్ అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు. బీఆర్ఎస్ లో తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసినవాళ్లే స్వయంగా పిలిచినా పోయే ప్రసక్తే లేదని ఈటల స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో కూడా ఇలానే ప్రచారం చేశారని, తన ప్రశ్నలకు జవాబు చెప్పినంత మాత్రాన పొంగిపోతాననుకుంటే పొరపాటేనని ఈటల తెలిపారు.