మళ్లీ కామెడీ అయిపోయిన ఏపీ ఐటీ మంత్రి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు ఈ మ‌ధ్య కామెడీకి కేరాఫ్ అడ్ర‌స్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఐటీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చేసే కామెడీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఏదో ఒక కామెంట్‌తో వారంలో ఒక్క‌సారైనా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కాకుండా ఉండ‌రు ఆయ‌న‌.

కొన్ని రోజుల కింద‌టే దావోస్ ఫినాన్షియ‌ల్ స‌మ్మిట్‌కు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఎవ‌రూ వెళ్ల‌క‌పోవ‌డంపై స్పందిస్తూ.. అక్క‌డ చ‌లి ఎక్కువ‌ని, పెట్టుబ‌డి దారుల్నే ఇక్క‌డికి ర‌ప్పిస్తామ‌ని అమ‌ర్నాథ్ చేసిన కామెంట్లపై ఎంత ట్రోలింగ్ జ‌రిగిందో తెలిసిందే.

అంత‌కుముందు కూడా ప‌లుమార్లు ఇలాంటి కామెడీ స్టేట్మెంట్లో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు అమర్నాథ్. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న వ్యాఖ్య‌లు వైర‌ల్ అయి.. ట్రోలింగ్ ఒక రేంజిలో జ‌రుగుతోంది.

హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఫార్ములా-ఈ ఈవెంట్‌కు ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున అతిథుల్లో ఒక‌రిగా వ‌చ్చారు అమ‌ర్నాథ్‌. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగాక‌.. ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఇంత‌కీ ఏపీలో ఫార్ములా-ఈ త‌ర‌హా రేసులు ఎప్పుడు నిర్వ‌హిస్తారు అని విలేక‌రులు అడిగారు.

దీనికాయ‌న బ‌దులిస్తూ.. కోడి గుడ్డు మాత్ర‌మే పెట్ట‌గ‌ల‌దు. కోడి కోడిని పెట్ట‌లేదు క‌దా. సో కోడి గుడ్డు పెట్టాలి. దాన్ని హ్యాచ్ చేయాలి. దాన్ని కోడిగా మార్చాలి. ఏపీలో ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది. దాన్ని పెట్ట‌గా మార్చ‌డానికి టైం ప‌డుతుంది అంటూ కోడి పురాణం చెప్పారు అమ‌ర్నాథ్. ఫార్ములా ఈ గురించి అడిగితే ఈ కోడి-గుడ్డు క‌థ‌లేంటయ్యా.. ఈయ‌న మన ఐటీ మంత్రా అంటూ ఈ వీడియోను వైర‌ల్ చేస్తూ అమర్నాథ్‌ను విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.