టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. లోకేష్ ప్రతీ ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఒకటొకటిగా ఎండగడుతూ ఓపిగ్గా ప్రజలకు అర్థమయ్యేట్టు వివరిస్తున్నారు. తాడేపల్లి పిల్లికి ఏమీ చేతకాదని సెటైర్లు వేస్తున్నారు. జనంలోకి వస్తే నిజమేమిటో తెలుస్తుందని సవాలు చేస్తున్నారు. సెల్ఫీల కోసం వచ్చే జనాన్ని నిరాశ పరచకుండా అందరితో ఫోటోలు దిగుతున్నారు. మార్గమధ్యంలో రైతులను, ముఖ్యంగా మహిళా రైతులను పలుకరిస్తున్నారు..మైక్ లో మాట్లాడటానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఇబ్బందేమీ లేదని, సైకో ఇంటికి పోయేంత వరకు తన గొంతు వినిపిస్తూనే ఉంటానని లోకేష్ అంటున్నారిు…
మమ్మీ …డాడీను చూడాలని ఉంది..
లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ వెళ్లి నారా వారబ్బాయిని కలిశారు. జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభిస్తే అంతకు రెండు రోజుల ముందు జనవరి 25న హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని, భార్య – కుమారుడి శుభాకాంక్షలు అందుకుని లోకేష్ ఇంటి నుంచి బయలుదేరారు. తండ్రిని చూసి పక్షం రోజులు కావడంతో దేవాన్ష్ దిగులుపడ్డారు. ఒకసారి నాన్నను చూడాలని ఉందని బ్రాహ్మణికి చెప్పారు. దానితో శనివారం హుటాహుటిన దేవాన్ష్ ను తీసుకుని బ్రాహ్మణి బయలుదేరారు. లోకేష్ బస చేసిన కొత్తూరు విడిది కేంద్రానికి చేరుకున్నారు. 17వ రోజు పాదయాత్ర ప్రారంభించే ముందు కాసేపు ముగ్గురు సంతోషంగా గడిపారు. తర్వాత యాత్ర యథావిధిగా కొనసాగింది..
వైసీపీ సోషల్ మీడియా ప్రచారం
లోకేష్ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియా నెగిటివ్ ప్రచారం చేస్తోంది. యాత్రకు పాపులారిటీ పెరిగే కొద్దీ ప్రచారం పెంచేసింది. లోకేష్ వెళ్లే ప్రతీ గ్రామానికి వైసీపీ సోషల్ మీడియా సైన్యం ముందే చేరుకుంటోంది.యాత్రకు జనం కూడే లోపే డ్రోన్లు, సెల్ ఫోన్లలో వీడియోలు తీసి.. లోకేష్ యాత్రకు స్పందన లేదని ప్రచారం మొదలు పెట్టేస్తోంది. తాడేపల్లిలో కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ రెడ్డి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు చెబుతున్నారు. సీఐడీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ వైసీపీ సోషల్ మీడియాకు సహకరిస్తున్నారు. దీనికి టీడీపీ సోషల్ మీడియా కౌంటరివ్వడంతో పాటు.. వైసీపీ దుశ్చర్యలపై గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేసింది..