మా మంత్రి అవినీతి రాయుడు.. వైసీపీలో రోడ్డెక్కిన వివాదం!!

వైసీపీ నేత‌లకు ప్ర‌తిప‌క్షాల‌తో ప‌నిలేకుండా పోయింది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల‌కు.. మంత్రుల‌కు సొంత పార్టీలోనే కేడ‌రే కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్‌.. పార్టీ నాయ‌కుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. మా నాయ‌కులే అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ.. కేడ‌ర్‌లోని కీల‌క కార్య‌క‌ర్త‌లు.. ముఖ్యులు రోడ్డెక్కుతున్న‌ప‌రిస్థితి రోజు రోజు కు పెరుగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి డాక్ట‌ర్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై సొంత పార్టీ నాయ‌కులు.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. “మా మంత్రి అవినీతి రాయుడు” అంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

వాస్త‌వానికి శ్రీకాకుళం జిల్లా ప‌లాస నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకున్న డాక్ట‌ర్ సీదిరికి రెండో సారి కేబినెట్ క‌న్నా ముందుగానే సీఎం జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు. అయితే.. ఆయ‌న మంత్రి అయిన త‌ర్వాత‌.. పార్టీలో ఒక‌వైపే చూస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఒక వ‌ర్గం వారికి మాత్ర‌మే ఆయ‌న ప‌నులు చేస్తున్నార‌ని.. త‌మ‌ను అణిచేస్తున్నార‌ని మ‌రో వ‌ర్గం నాయకులు గ‌త ఏడాది వ‌న భోజ‌నాల స‌మ‌యంలోనే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం ప‌ట్టించుకోక పోవ‌డంతో ఇప్పుడు ఏకంగా రోడ్డెక్కేశారు.

ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అసమ్మతి నేతలు దువ్వాడ హేంబాబు చౌదరి, దువ్వాడ శ్రీకాంత్, జుత్తు నీలకంఠంలు కొన్నాళ్లు గా మంత్రి సీదిరిపై గుస్సాగా ఉన్నారు. ఆయ‌న త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై నిజ నిర్దారణ కమిటీ వేసి, గ్రామాల్లో తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని వెల్లడించారు. ఆ నివేదికను జిల్లా నేతలతో పాటు సీఎం జగన్కు పంపిస్తామని వెల్లడించారు.

‘పలాస నియోజకవర్గంలో వైసీపీపై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు చేస్తున్నారు. అసలు కారణాలపై మేము ఓ నిజనిర్దారణ కమిటీ వేసి ప్రతి గ్రామానికి వెళ్తాం. వైసీపీలో ఎవ్వరూ అవినీతి చేసినా.. అది మా పార్టీకి ఇబ్బందే అందుకోసం ప్రతి గ్రామానికి వెళ్లేందు ప్రయత్నిస్తాం. వారు చెప్పె సలహాలు సూచనలు తీసుకుంటాం. జగన్ 2011 నుంచి ఇప్పటివరకు పార్టీ తరఫున ఎలాంటి పిలుపు ఇచ్చినా చేశాం. మా పార్టీలో అవినీతి జరగకుడండా చూడటం కోసమే మేమంతా గ్రామాల్లో ప్రయత్నిస్తాం. అవినీతి జరిగినట్లు తెలిస్తే.. ఆ వివరాలు జిల్లా నాయకులతో పాటుగా… మా అధినేత జగన్కు సైతం వివరాలు పంపిస్తాం.’ అని వారు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.