దేశాన్ని కుదిపేస్తున్న కీలక కేసుల్లో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మొదటి వరుసలో చేరింది. ఈ కేసులో తాజాగా ఏపీకి చెందిన ఒంగోలు అధికార పార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆయనకు ఈ కేసుకు సంబంధం ఏంటి? ఎందుకు అరెస్టు చేశారు. అసలు ఢిల్లీలో జరిగిన స్కామ్‌కు ఒంగోలులో ఎందుకు తీగ కదిలింది? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. వాటిని పరిశీలిస్తే.. అనేక ఆసక్తికర విషయాలు తెరమీదికివస్తున్నాయి.
1) మాగుంట కుటుంబం కొన్ని దశాబ్దాలుగా.. లిక్కర్ వ్యాపారంలో ఉంది. కేవలం ఏపీలో వారు చేసే వ్యాపారం 25 శాతం మాత్రమే. ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లోనే మెజారిటీ వ్యాపారం చేస్తున్నారు. ఇక, మాగుంట వారసుడిగా.. రాఘవరెడ్డి ఈ వ్యాపారాలను చక్కబెడుతున్నారు.
2) ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన సౌత్ గ్రూప్(దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బృందాలు)లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ గ్రూపు నిర్వహించిన మీటింగ్‌ల్లో మాగుంట రాఘవ పాల్గొన్నారు.
3) మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
4) సౌత్ గ్రూపు తరఫున సుమారు 100 కోట్ల రూపాయలను చేతులు మార్చినట్టు తెలుస్తోంది. అదేసమయంలో రాఘవరెడ్డి కొందరికి ఫోన్లు సరఫరా చేశారని.. అదేవిధంగా సమావేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను రూపొందించడం.. వెన్యూలు రెడీ చేయడం.. వ్యాపార డీల్స్ కుదర్చడంలోనూ రాఘవ ప్రధాన పాత్ర పోషించారు.
5) అదేవిధంగా గోవాకు తరలించిన రూ.100 కోట్ల నిధుల విషయంలోనూ రాఘవ కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. బలమైన ఆధారాలతోనే ఆయనను అరెస్టు చేసినట్టు తెలిసింది.