సాయిరెడ్డికే కీల‌క‌ బాధ్య‌త‌లు.. మ‌రోసారి కీ రోల్‌కు రెడీ…!


“ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పాగా వేయాలి. సీమ‌లో ఫ‌ర్వాలేదు. ఇక‌, కోస్తాలో ఎంత చించుకున్నా.. ఫిఫ్టీ -ఫిఫ్టీ అయితే.. చాలు”- ఇదీ.. వైసీపీ అధినేత ..సీఎం జ‌గ‌న్ విధానం.. నినాదంగా ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాలని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి బాధ్య‌త‌ల‌ను పార్టీలో నెంబ‌ర్‌2గా ఉన్న‌(అప్ప‌ట్లో) విజ‌య‌సాయిరెడ్డి చూసుకునేవారు.

దీంతో పార్టీ ప‌రుగులు పెట్టింది. విశాఖ మేయ‌ర్ పీఠాన్ని కూడా వైసీపీ ద‌క్కించుకుంది. అయితే.. వివిధ కారణాల‌తో ఆయ‌న‌ను త‌ప్పించిన త‌ర్వాత‌..అనూహ్యంగా పార్టీ వెనుక‌బ‌డి పోయింది. ప్ర‌స్తుతం వైవీ సుబ్బారెడ్డి ఇక్క‌డి పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్న‌ప్ప‌టికీ.. అనుకున్న రేంజ్‌లో అయితే ముందుకు సాగ‌డం లేదు. ఆయ‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలోనూ.. వెనుక‌డుగు వేస్తున్నారు. దీంతో ఇది ఎన్నిక‌ల‌కు ముందు కొంపముంచేలా ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

దీంతో జ‌గ‌న్ తిరిగి విజ‌య‌సాయిరెడ్డికే బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సాయిరెడ్డిపై కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న స‌మ‌ర్థ‌వంతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. పాద‌యాత్ర చేసి.. పార్టీని కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిపించారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. త‌ప్ప పార్టీ కుదురుకునే ప‌రిస్థితి లేద‌ని జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నారు. వాస్త‌వంగా చూసినా.. ప్ర‌స్తుతం వైసీపీ దూకుడు త‌గ్గిపోయింది.

ఇదేస‌మ‌యంలో టీడీపీ దూకుడు పెరిగింది. మ‌రోవైపు జ‌నసేన 2 జిల్లాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయా లు చేస్తోంది. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో.. జ‌నసేన కార్య‌క్ర‌మాలు గ‌తం కంటే ఎక్కువ‌గా పెరిగాయి. రెండు సార్లువ‌రుస‌గా జ‌న‌సేనాని ఇక్క‌డ స‌భ‌లు నిర్వ‌హించారు. ఇది రాజ‌కీయంగా వైసీపీకి డౌన్ ఫాల్ అయింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. పైగా వైవీ రూపాయి ఖ‌ర్చు పెట్ట‌డం లేదు. సాయి రెడ్డి అయితే.. ఏదో ఒక కార్య‌క్ర‌మంతో ఇక్క‌డ నిత్యం మీడియాను ఎంగేజ్ చేసేవారు. దీంతో ఆయ‌నైతే క‌రెక్ట్ అని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.