ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరో వైపు అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు.. వివాదాలు రోజుకోరకంగా తెర మీదికి వస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ప్రధానంగా సీఎం జగన్‌కు ఆత్మీయుడిగా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బయటపడిపోయారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలకు కనీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వని సీఎం జగన్ ఇప్పుడు దిగి వచ్చారు. ఎమ్మెల్యేల సాధక బాధలు వినేందుకు రెడీ అయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించారు.
ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల పాటు ఉమ్మడికృష్ణా జిల్లాలోని కీలకమైన మైలవరం నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలపై స్వయంగా ఆయనే సమీక్షించారు. అటు మంత్రి జోగి రమేష్, ఇటు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌లతో సీఎం జగన్ భేటీ అయ్యారు. వారి సమస్యలు విన్నారు. ఎక్కడ విభేదాలు వచ్చాయో తెలుసుకున్నారు. తన మాట కనీసం చిన్నస్థాయి అధికారి కూడా వినిపించుకోవడం లేదని.. ఇదంతా కూడా మంత్రి జోగి జోక్యంతోనే జరుగుతోందని వసంత కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. అదేసమయంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తే ప్రజలు కూడా అనేక సమస్యలు ఏకరువు పెడుతున్నారని తెలిపారు.
అటు అధికారులు మాట వినకపోవడం.. ఇటు మంత్రి జోక్యంతో తాను విసిగిపోయానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. ఈ పరిణామాలను సరిదిద్దే బాధ్యత తనదేనని తేల్చి చెప్పారు. ఆ వెంటనే సంబంధిత అధికారులతోనూ ఆయన చర్చించి.. ఎమ్మెల్యే చెప్పింది చేయాలని ఆయన సూచించారు. దీంతో ఎమ్మెల్యే వసంత శాంతించారు. త్వరలోనే గడప గడప కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్టు చెప్పారు. మొత్తానికి కోటంరెడ్డి ఎఫెక్ట్ వైసీపీకి బాగానే తగిలిందని అంటున్నారు పరిశీలకులు.
ఇదిలావుంటే, మరోవైపు.. వసంత కృష్ణప్రసాద్.. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ ప్రసక్తి లేదని.. మంత్రి జోక్యంతోనే ఇన్నాళ్లుగా సమస్యలు వచ్చాయని.. సీఎం జగన్ జోక్యం చేసుకునేందుకు హామీ ఇచ్చారని.. తాను పార్టీమారబోనని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేత దేవినేని ఉమాను ఓడించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఒకవేళ పార్టీ మారే పరిస్థితి వస్తే.. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏదేమైనా.. సీఎం జగన్ జోక్యంతో సమస్య పరిష్కారం అయినట్టేనని ఎమ్మెల్యే వర్గం చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates