ఔను! ఇప్పుడు జగన్ శిబిరంలో దడదడ ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు.. జరుగుతున్న పరిణామా లు.. జగన్ శిబిరంలోని కీలక నాయకులకు కంటిపై కునుకు కరువైందనే వాదన బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అన్న నాయకులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. నిజానికి 2019 ఎన్నికల మాదిరిగా 2024 ఎన్నికలు ఉండేందుకు అవకాశం లేదు. నలువైపుల నుంచి కూడా దాడి ఎక్కువైంది. పైగా.. కేంద్రం ఏదో తమను ఉద్ధరిస్తుందని వైసీపీ పాలకులు పెట్టుకున్న ఆశలు కూడా కొడిగడుతున్నా యి.
ఈ పరిణామాలకు ప్రస్తుతం జరుగుతున్న కొన్ని నిర్ణయాలు.. కొన్ని వాదనలు వైసీపీకి సహజంగానే దడ పుట్టిస్తున్నాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య విస్తరించాలని వేసుకున్న ఎత్తుగడకు కేంద్రం గండికొట్టింది. అసలు తమకు ఈ విషయమే తెలియదని.. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉన్నదని కూడా చెప్పుకొచ్చింది. దీంతో రేపో మాపో.. విశాఖ వెళ్లిపోవాలన్న సీఎం జగన్ నిర్ణయానికి పెద్ద అవరోధం ఏర్పడినట్టు అయింది.
ఇక, పోలవరం నిధులను ఇప్పట్లో విడుదల చేసేది లేదని కేంద్రం ఇటీవల చెప్పేసింది. బడ్జెట్‌లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. పైగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం స్థాయిలోనే చర్చలకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఒక్కసారికి తనను నమ్మాలని చెబుతున్న ఒక కీలక పార్టీ నేతకు దన్నుగా నిలిచేందుకు కూడా కేంద్రంలోని పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నతీరు.. వైసీపీలో దడ పుట్టిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెరగడం.. ఈ కేసులో తమను ఇరికించొద్ద ని కేంద్రమే స్పష్టం చేయడం.. దీనిలో తాము ఏమీ చేయలేమని చెప్పడం కూడా సీఎం జగన్ సహా వైసీపీ పెద్దలను ఆలోచనలో పడేసింది. మరోవైపు.. ఈ నెల, వచ్చే నెలలో జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసుల విచారణ పుంజుకోనుంది. ఎన్నికలకు ముందు ఈ కేసులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దల నుంచేసంకేతాలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు జగన్ శిబిరంలో కల్లోల పూరిత వాతావరణం నెలకొంది. దీంతో ఎక్కడో తేడా కొడుతోందని.. ఏంచేయాలని.. నాయకుల మధ్య చర్చ జరుగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates