పదవి దక్కినా.. ఫలితం లేకుండా పోయిందట.. ప్రముఖ సినీ హాస్య నటుడు అలీకి! ఆది నుంచి కూడా వైసీపీకి మద్దతు దారుగా నిలిచిన అలీ.. అందరిలాగానే.. తాను కూడా రాజకీయంగా ఒక మెట్టు ఎదగాలని కోరుకున్నారు. అందుకే గత రెండు ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఇక, గత ఏడాది టికెట్ల వివాదం తలెత్తినప్పుడు.. ఇండస్ట్రీలో కొందరిని కంట్రోల్ చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారు.
దీంతో జూనియర్ ఆర్టిస్టులు ఎవరూ కూడా నోరు విప్పకుండా.. జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆయనకు సలహాదారు పదవిని కట్టబెట్టింది. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించి రెండు మాసాలు అయిపోయింది. ఈ క్రమంలో ఆయన ఏం చేస్తారో.. ఏం చేయాలో.. తెలియదు. ఎందుకంటే.. ప్రభుత్వానికి సొంతగా ఎలక్ట్రానిక్ మీడియా అంటూ.. ఏమీలేదు. కేంద్ర ప్రభుత్వానికి దూరదర్శన్ ఉన్నట్టుగా ఏపీకి అలాంటిది లేదు.
పోనీ.. ప్రభుత్వానికి అధికారిక ట్విట్టర్‌కానీ, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూపులు కానీ ఉన్నాయా? అంటే అవి కూడా లేవు. అయినప్పటికీ..ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీకి అవకాశం ఇచ్చి..నెలకు 3లక్షల వేతనం రెండు కార్లు.. ఇద్దరు బాడీగార్డులు, ఇద్దరు పీఏలు ఇలా.. కల్పించారు. అయితే.. ఈయన కూర్చునేందుకు మాత్రం.. ఎక్కడా చోటు చూపించలేదట! ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చ సాగుతోంది.
ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రం సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ సీటులో కూర్చుని.. ప్రమాణ స్వీకారం చేసేశారు. తర్వాత.. విజయ్‌కుమార్ కల్పించుకుని త్వరలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు అలీ ఎక్కడ కూర్చోవాలో.. ఏం చేయాలో కూడా చెప్పలేదు. కానీ, ఆయన మాత్రం సలహాదారుగానే కొనసాగుతున్నారు. మరి మున్ముందు అయినా.. ఆఫీస్, కుర్చీ వంటివి చూపిస్తారో లేదో చూడాలి.