సునీల్ కుమార్ పై చర్యలు.. రాజుగారు సంభరాలు

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చర్యలు తీసుకుని, నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఒక వేదక ఏర్పాటు చేసిన సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రం ఆదేశించింది. చర్యల నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్టు)ను తమకు సమర్పించాలని కూడా ఉత్తర్వులిచ్చింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ అనేక వివాదాస్పద చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా కూడా విపక్షాలపై కొన్ని కేసులు పెట్టినట్లు చెబుతున్నారు. పైగా ఆయన తరచూ అమెరికా వెళ్లివస్తున్నారు. క్రైస్తవ మత ప్రచారం చేస్తారన్న ఆరోపణలున్నాయి. ఇటీవలే ప్రభుత్వం ఆయన్ను బదలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తనకు డీజీపీ పదవి ఇవ్వబోతున్నారని సునీల్ కుమార్ సంబరపడిపోయినా ఇంతవరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు సునీల్ పై చర్యలకు కేంద్రం ఆదేశించడంతో, ఆ సంగతి ముందే పసిగట్టి బదిలీ చేశారని భావించాల్సి వస్తోంది.

నిజానికి సునీల్ కుమార్ కు రఘురామకు మధ్య చాలా కాలంగా వైరం ఉంది. సీఐడీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు రఘురామను సునీల్ కాళ్లు విరగ్గొట్టించారని ఎంపీ స్వయంగా చెప్పుకున్నారు. జగన్ కళ్లలో ఆనందాన్ని చూసేందుకు తనను కొట్టారని రఘురామ ఆరోపించారు. దానితో సునీల్ మాట్లాడిన వీడియోలన్నింటినీ ఆయన కేంద్రానికి పంపారు. వాటి ఆధారంగానే కేంద్రం చర్యలకు ఆదేశించినట్లు చెబుతున్నారు.