ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. జగన్‌కి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని, సీఎం వైఖరి, ఆయన చేస్తున్న విధ్వంసాన్ని సరిచేయడం రాజ్యాంగ సంస్థలకూ కష్టంగా మారిందన్నారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని ఉందని ధ్వజమెత్తారు. లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా పేర్కొన్నా… 3రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. చట్టబద్ధంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే ప్రధాని వచ్చి శంకు స్థాపన చేశారని తెలిపారు. పార్లమెంట్ మొత్తం అమరావతికి అండగా ఉంటుందని శంకుస్థాపన రోజు ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని పేరిట వివిధ సందర్భాల్లో అమరావతి పై జగన్ చేసిన ప్రసంగాల వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు.
ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావటానికి వీల్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని స్పష్టంగా తేలిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా జీవితం అంటే జగన్ రెడ్డికి అంత చులకనా? అని చంద్రబాబు నిలదీశారు.
అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే పన్నుల రూపేణా రాష్ట్రమంతటికీ ఆదాయం వచ్చి ఉండేదని పేర్కొన్నారు. ప్రజా వేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో రహదారు లు తవ్వేసేదాకా వచ్చిందని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాలను సైతం వదలకుండా విధ్వంసం సాగిస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం కన్నా కూడా జగన్ అత్యంత ప్రమాద కారి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.