యువ‌గ‌ళంను పోలీసులు వ‌దల‌డం లేదుగా!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో సేమ్ సీన్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. పోలీసులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం 15వ రోజుకు చేరుకున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను అడుగ‌డుగునా నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రెండు రోజుల కింద‌ట లోకేష్ కొద్ది సేపు కూర్చుని సేద దీరేందుకు ఏర్పాటు చేసుకున్న స్టూల్ స‌హా సౌండ్ బాక్సుల వాహ‌నాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టికీ ఇవ్వ‌లేదు.

దీంతో మ‌రో వాహ‌నం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సంసిరెడ్డిపల్లెకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర ను పోలీసులు మ‌రో సారి అడ్డుకున్నారు. దీంతో పాద‌యాత్ర‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేష్ ను మాట్లాడనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మైక్ తీసుకొస్తున్న బాషాపై దాడి చేసి గాయపరిచి మరీ పోలీసులు మైక్ లాక్కున్నారు. లోకేష్ మాట్లాడేందుకు నిలుచున్న స్టూల్‌ను కూడా లాక్కునేందుకు ప్రయత్నించారు.

అయితే.. పోలీసుల తీరుపట్ల టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పోలీసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా లోకేష్ స్టూల్ మీదే నిలబడి నిరసన తెలిపారు. ఇదిలావుంటే, లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌.. ప్ర‌స్తుతం మంత్రి నారాయ‌ణ స్వామి సొంత నియోజ‌క‌వ‌ర్గం గంగాధ‌ర నెల్లూరులో సాగుతోంది. దీంతో పోలీసులు మంత్రి ఆదేశాల‌తోనే రెచ్చిపోయి.. ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

గురువారం దాదాపు ఐదారు కిలోమీటర్లు నడిచిన తర్వాత గంగాధర నెల్లూరు మండలం సంసిరెడ్డిపల్లె వద్దకు పాదయాత్ర చేరుకుంది. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు హ్యాండ్ మైక్‌ను తీసుకురా వాల్సిందిగా కార్యకర్తను లోకేష్ కోరారు. మైక్ తీసుకువెళ్తున్న కార్యకర్తను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. ఇక్కడ మాట్లాడేందుకు వీలులేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు డౌన్‌ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న ప్రాంతంలోనే వారికి మద్దతుగా లోకేష్ స్టూల్ మీద ఎక్కి నిరసనకు దిగారు.