ఇలాంటి వారితోనే టీడీపీకి చేటు!

టీడీపీలో పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు మాట‌ల‌కు.. ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్రమాల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిన నాయ‌కులు.. ఈ ప‌నిని వ‌దిలేసి, త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. చంద్ర‌బాబు లేదా.. ఆయ‌న కుమారుడు మాత్ర‌మే ప‌ద‌వులు అనుభ‌వించ‌రు. పార్టీలో ఉన్న నాయ‌కులు అంద‌రూ కూడా ల‌బ్ధి పొందుతారు. ఇది చాలా సింపుల్ విష‌యం.

మ‌రి ఈ విష‌యం తెలిసి కూడా చాలా మంది నాయ‌కులు.. త‌మ‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌వారు కొందరు ఉంటే.. తెలిసి కూడా త‌ప్పులు చేస్తున్న వారు ఇంకొంద‌రు ఉన్నారు. దీంతో ఇలాంటి వారితోనే టీడీపీ చేటు చంద్ర‌బాబు.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా నారా లోకేష్ పాద‌యాత్ర చేస్తున్నారు. యువ‌గ‌ళం పేరుతో ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర 15వ రోజుకు చేరుకుంది. దీనిని పార్టీ చాలా కీల‌కంగా భావిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి దీనిని ప్ర‌ధాన అస్త్రంగా తీసుకోనుంది. ప్ర‌జ‌ల్లో సింప‌తీని సంపాయించుకుని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ప్ర‌య‌త్నిస్తోంది. పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఈ యాత్ర‌లో భాగం కావాల‌ని కూడా చంద్ర‌బాబు కోరుతున్నారు. అయితే.. దీనికి అనుకూలంగా వ్య‌వ‌హరించేవారు చాలా స్వ‌ల్పంగా క‌నిపిస్తున్నారు. అదే స‌మ‌యంలో కీల‌క నేత‌లు ఒక‌రిద్ద‌రు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది.

రాష్ట్ర స్థాయిలో ప్ర‌భావం చూపుతార‌నే నాయ‌కులుగా ఉన్న జేసీ దివాక‌ర్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు యువ‌గ‌ళాన్ని ఉద్దేశించిన‌వేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పాద‌యాత్ర‌ల‌కు కాలం చెల్లింద‌ని.. పాద‌యా త్ర‌ల‌తో క‌లిసి వ‌చ్చేది లేద‌ని.. యాత్ర‌ల ద్వారా డ‌బ్బులు గుంజుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ చేసిన‌ పాద‌యాత్ర కు ఆయ‌న కితాబు నివ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యాఖ్య‌ల ప్ర‌భావం యువ‌గ‌ళంపై ప‌డుతుంద‌ని.. ఇలాంటివారిని చంద్ర‌బాబు ఉపేక్షించ‌డం స‌రికాద‌ని.. చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.