నెల్లూరు వైసీపీలో చోటు చేసుకున్న వివాదం.. ఇప్పుడు కేంద్రం వద్దకు చేరింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. గత వారం రోజుల్లో జరిగిన పరిణామాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని..దీని పై విచారణ జరిపించాలని ఆయన కోరారు. తన ఫోన్ ట్యాప్ చేసిన విషయాన్ని ఇద్దరు ఐపీఎస్ అధికారులు తనకు చెప్పారని.. తాను అధికార పార్టీ నేతగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రభుత్వమే ఉందని తాను అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా కోటంరెడ్డి దీనికి జత చేశారు. నిష్ఫాక్షిక విచారణ జరిపించేలా ఆదేశించాలని కోరారు. అదే సమయంలో తనకు కొన్ని వర్గాల నుంచి ప్రమాదం పొంచి ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను కుదించిందని 2+2గా ఉన్న తన భద్రతను 1+1గా కుదించిందని.. దీనిపై వివరణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సూచించారు.
తను ఫోన్ మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని.. కొందరు చేస్తున్న ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు కోటంరెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు లేఖలో స్పష్టం చేశారు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశించినా.. తాను అన్ని విధాలా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం కోటంరెడ్డి రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇటీవల ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. ఆ వెంటనే ఆయనన నియోజకవర్గం ఇంచార్జ్‌గా తొలగించడం.. నెల్లూరు రూరల్ బాధ్యతలను ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అప్పగించడం వంటివి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నేరుగా కేంద్రం తలుపు తట్టడం వివాదాన్ని మరింత పెంచేలా కనిపిస్తోందని అంటున్నారుపరిశీలకులు.