సీఏ అరెస్టుతో కవితకు టెన్షన్

ఢిల్లీ లిక్కర స్కాం విచారణ వేగవంతమైంది. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల మధ్య ఆయన్ను అరెస్టుచేశారు. సీబీఐ ఎంతో పకడ్బందీగా వ్యవహరించి బుచ్చిబాబును అదుపులోకి తీసుకుంది. తొలుుత విచారణ నిమిత్తం ఢిల్లీ పిలిపించింది. రోజంతా ప్రశ్నించింది. రాత్రి తమ కార్యాలయంలోనే ఉంచారు. బుధవారం ఉదయం అరెస్టును ప్రకటించారు..

ఢిల్లీ మద్యం కుంభకోణంపై రెండు కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈడీ, సీబీఐ ఈ దిశగా వేగం పెంచాయి. ఈ స్కామ్ లో భాగస్వాములుగా అనుమానిస్తున్న కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి సహా పలువురిని సౌత్ గ్రూపుగా పిలుస్తున్నారు. గత వారం ఈడీ రెండో ఛార్జ్ షీటును ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసింది. 428 పేజీల ఛార్జ్ షీటులో ఎమ్మెల్సీ కవిత పేరు రెండో సారి కనిపించింది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చేర్చారు. ఈడీ ఛార్జ్ షీటు ప్రకారం 17 మంది నిందితులున్నారు.

కవిత పై నజర్

కవితను సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి మరీ ప్రశ్నించి వెళ్లారు. ప్రస్తుతానికి ఆమె అనుమానితురాలిగానే ఉన్నారు. ఇంకా నిందితురాలిగా చేర్చలేదు. అలా జరగాలంటే సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులిచ్చి ప్రశ్నించాలి. చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు అరెస్టుతో కవిత చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. ఆయన నుంచి సేకరించే సమాచారం ఆధారంగా కవితపై బలమైన సాక్ష్యాధారాలను సిద్ధం చేయాలని సీబీఐ భావిస్తోంది.