ఎవరు ఆ ఛానల్ ప్రతినిధి? ఆసక్తికరంగా మారిన చర్చ

ప్రశ్నించటం పాత్రికేయుడు చేయాల్సిన పని. కానీ.. ఇప్పుడున్న వ్యవస్థలు.. వాటిని నడిపించే పెద్ద మనుషుల పుణ్యమా అని.. పాత్రికేయానికి కొత్త అర్థాలు చెప్పటమే కాదు.. వారికున్న హక్కుల్ని.. ప్రశ్నించే తత్త్వాన్ని తమకున్న అధికారంతో అడ్డుకుంటున్నారు.

గడిచిన పదిహేనేళ్లలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారైనా సరే.. తమను కించిత్ మాట అన్నా ప్రశ్నించేవారు. తప్పు లేకుండా తమకు ఉద్దేశాలు ఆపాదిస్తే రిపోర్టర్లు ఊరుకునే వారు కాదు. తమ అభ్యంతరాల్ని బలంగా తెలిపేవారు.

ఇలాంటి పరిస్థితి నుంచి ప్రెస్ మీట్ పెట్టేసి మరీ కడిగేస్తున్న ముఖ్యమంత్రులు.. అందుకు మౌనంగా తలాడిస్తూ పని చేస్తున్న వైనంతో తమకున్న ప్రత్యేక హక్కుల్ని మర్చిపోయిన పాత్రికేయ తరం ఇప్పుడు ఉంది.

మిగిలిన రంగాల మాదిరి కాకుండా సమాజం కోసం ప్రజల కోసం అనుక్షణం తపించే అవకాశం ఉన్నా.. మీడియా యాజమాన్యాల తీరుతో పాత్రికేయులు ఎవరికి వారు తమ పరిధిని కుంచించుకోవటం ఎక్కువైంది. దీంతో.. పాలకులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం ఎక్కువైంది.

ఇలాంటి వేళలో తాజాగా ఒక చానల్ ప్రతినిధి హైకోర్టును ఆశ్రయించారు. సచివాలయాన్ని కూల్చివేతకు సంబంధించి మీడియా కవరేజ్ ను అడ్డుకుంటున్న అధికారుల తీరును ప్రశ్నించారు. జరుగుతున్న విషయాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను అడ్డుకుంటున్న సర్కారు తీరు సరికాదంటూ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. యుద్ధ భూమిలోనూ రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లే మీడియా ప్రతినిధుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అనుమతులు ఎందుకు ఇవ్వటం లేదు? అన్న ప్రశ్నల్ని సంధించారు.

దీనికి మీడియా ప్రతినిధుల రక్షణ కోసమేనని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది మాటలకు న్యాయమూర్తులు సరైన రీతిలో ప్రశ్నలు వేశారు. కూల్చివేత పనులు ఆగిన సమయంలో మీడియాను అనుమతిస్తే సరిపోతుంది కదా? అన్న ప్రశ్నకు ఏజీ దగ్గర సమాధానం లేని పరిస్థితి. మొత్తంగా మీడియాకున్న ప్రత్యేక హక్కుల్ని.. అధికారాల్ని అందరికి అర్థమయ్యేలా చేసిన ఆ టీవీ చానల్ ప్రతినిధి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ‘‘ఎస్ సార్’’ అనేయటం అలవాటుగా మారిన వేళ.. అందుకు భిన్నంగా ఎందుకిలా చేస్తున్నారు? అని ప్రశ్నించాలన్న విషయాన్ని మర్చిపోతున్నారన్న విషయాన్ని గుర్తు చేసేలా చేసిన చానల్ ప్రతినిధి ఎవరన్న దానిపై మీడియా వర్గాల్లో ఎంక్వయిరీలు నడుస్తున్నాయి. త్వరలోనే ఆ వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.