కేసీఆర్ సంక్షేమ-‘ఎన్నిక‌ల‌’ బ‌డ్జెట్..!

అంద‌రూ ఊహించిన‌ట్టుగానే.. ఆర్థిక వేత్త‌లు.. రాజ‌కీయ ప‌రిశీల‌కులు సైతం అంచ‌నా వేసిన‌ట్టుగానే తెలంగాణ ప్ర‌భుత్వం 2023-24 వార్షిక బ‌డ్జెట్‌ను వండి వార్చింది. మొత్తం 3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌తో బ‌డ్జెట్‌ను రూపొందిస్తున్నార‌నే అనుకున్నా.. అంత‌కు కొంచెం అటు ఇటుగా.. 2 ల‌క్ష‌ల 90 వేల 396 కోట్ల రూపాయ‌ల‌తో తాజాగా బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు.

ఈ మొత్తంలోనూ అత్య‌ధికంగా.. సంక్షేమానికి కేటాయించ‌డాన్ని బ‌ట్టి.. ఎన్నిక‌ల స‌మ‌రానికి పార్టీ సర్వ స‌న్న ద్ధ‌మైంద‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింది. ద‌ళిత బంధుకు గ‌త బ‌డ్జెట్ల కంటేకూడా భారీగా 17 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించ‌డం.. చూస్తే.. ఎన్నిక‌ల బ‌డ్జెట్ అని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అదేస‌మ‌యంలో రైతుల గురించి ప‌దే ప‌దే మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు తాజాగా బ‌డ్జెట్ వారికి భారీ కేటాయింపులు చేశారు.

రైతు రుణ మాఫీకి 6 వేల పైచిలుకు కోట్ల‌ను కేటాయించారు. అదేవిధంగా డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయ‌ల‌ను చూపించారు. ఇక కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ప‌రిగ‌ణిస్తున్న ఎస్సీల‌కు 36 వేల కోట్లు, ఎస్టీల‌కు 15 వేల కోట్ల ను కేటాయించ‌డం ద్వారా 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యాక‌ వ‌చ్చే ఆరేడు మాసాల్లో భారీ ఎత్తున వారిఅభ్యున్న‌తికి ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏతా వాతా ఎలా చూసుకున్నా కేసీఆర్ తాజా బ‌డ్జెట్ సంక్షేమ‌, ఎన్నిక‌ల బ‌డ్జెట్టేన‌న‌డంలో సందేహం లేదు.