ఎన్నిక‌ల టైంకి పార్టీ ఏంటో చెబుతా: జేడీ

మాజీ ఐపీఎస్ అధికారి, గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ప‌ట్నం ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒక పార్టీలోకి చేర‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. అది త‌న మ‌న‌సుకు న‌చ్చిన పార్టీ అయి ఉండాల‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ముందే ఆ విష‌యాన్ని చెబుతాన‌న్నారు.

వాస్త‌వానికి ఇటీవ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ తాను ఒంట‌రిగానే పోటీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. విశాఖ ఎంపీగా తాను, ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా త‌న కుమార్తె రంగంలోకి దిగ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇంత‌లోనే ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్న‌ట్టు కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా స్పందించిన ల‌క్ష్మీనారాయ‌ణ వ‌చ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు.

“నేను విశాఖ నుండి పోటీకి దిగుతున్నాను. మీడియావారు రోజుకో పార్టీలో నన్ను చేర్చుతున్నారు. బీఆర్ఎస్ నుండి పోటీ అనే ప్రచారం కేవలం ప్రచారం మాత్రమే. ఎన్నికల సమయానికి నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తాను. విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీం కోర్ట్ లో ఉంది. కోర్ట్ లో ఉన్నప్పుడు ఇష్టానుసార ప్రకటనలు చెల్లవు. అలా చేస్తే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది.” అని స్ప‌ష్టం చేశారు.

కాగా, ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెంచిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడుతూ.. బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను, మానవహక్కులను, పోలీసులను ఆశ్రయించవచ్చున‌న్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉంద‌న్నారు. అయితే, నిరాధార ఆరోపణలు పని చేయవని స్ప‌ష్టం చేశారు. దేశమంతటా రైతులకు ప్రాధాన్యత ఉందని, రాష్ట్రాలు కూడా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని జేడీ సూచించారు.