‘అలా చేస్తే.. కాబోయే ముఖ్యమంత్రి జూ.ఎన్టీఆర్’

తాను అభిమానించే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రోటీన్ కు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబును తిట్టాలని.. ఆయన్ను తన మాటలతో ఇరుకున పడేయాలన్నట్లుగా ఉండే లక్ష్మీ పార్వతి మాటలు.. తాజాగా మాత్రం కాస్తంత రివర్సు అయినట్లుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబును తీసిపారేసినట్లుగా మాట్లాడేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించే లక్ష్మీ పార్వతి.. ఆ క్రమంలో బ్యాలెన్సు మిస్ అయ్యినట్లుగా చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. ఆయన సామర్థ్యాన్ని గొప్పగా అభివర్ణించే క్రమంలో తాను అభిమానించే జగన్ ను తీసిపారేసినట్లుగా తన మాటలు ఉంటాయన్న విషయాన్ని ఆమె మిస్ అయినట్లున్నారు. సీఎం జగన్ పాలనపై ఆమె చేసే వ్యాఖ్యలు తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆకాశానికి ఎత్తేసే లక్ష్మీ పార్వతి.. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని.. కానీ ముఖ్యమంత్రి జగన్ మాదిరి ఐదేళ్లు ప్రజలతో మమేకమైతే.. గెలిచే అవకాశం ఉందని.. ముఖ్యమంత్రి అవుతారన్న జోస్యాన్ని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావటం అంటే.. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటమే అవుతుంది కదా? జూ.ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసి.. చంద్రబాబుకు చిరాకు పెట్టాలన్న వ్యూహం లక్ష్మీ పార్వతిది కాగా.. ఆ ఉత్సాహంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. చివరకు తమ మాటలతో ఆయన్ను ముఖ్యమంత్రిని చేసేసిన లక్ష్మీపార్వతి మాటలు హాట్ టాపిక్ గా మారాయి.

మొత్తానికి ముఖ్యమంత్రి జగన్ ను ఓడించే సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందన్న విషయాన్ని ఆమె మాటల్ని విన్నోళ్లందరికి అర్థమయ్యే పరిస్థితి. ఇలాంటి మాటలు జగన్ కు చిరాకు తెప్పిస్తాయన్న చిన్న విషయాన్ని లక్ష్మీ పార్వతి ఎలా మిస్ అయ్యారు? ఇంతకాలం జగన్ కు విధేయతగా ఉన్నందుకు ఈ మధ్యనే పదవి పొందిన ఆమె.. జూనియర్ ప్రస్తావతో అనవసరంగా చిక్కుల్లో పడినట్లు అవుతుందన్న విషయాన్ని ఎలా మిస్ అయ్యారంటారు?