అప్పుడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు..

యువ‌గ‌ళం పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ .. సీఎం జ‌గ‌న్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ముద్దులు పెట్టాడ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గుద్దులు గుద్దుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పదో రోజు యువ‌గ‌ళం పాదయాత్ర కొనసాగింది.

ఆదివారం ఉదయం తవనంపల్లె నుంచి ప్రారంభమైన యాత్ర.. తవనంపల్లె, ఐరాల మండలాల మీదగా సాగింది. కాణిపాకంలో ముస్లిం మైనారిటీలతో లోకేష్ భేటీ అయ్యారు. తొలుత ఆయ‌న వినాయ‌కుడి గుడిలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ముస్లింల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ముస్లింల‌ను రాజకీయంగా ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింలపై బనాయించిన అక్రమ కేసులను టీడీపీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో ఎత్తి వేస్తామని లోకేశ్‍ హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్‍.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమ‌ర్శించారు. కాగా, పాదయాత్రలో నారా లోకేష్‌కు మహిళలు హరతులు పట్టి స్వాగ‌తం ప‌లికారు. టీడీపీ శ్రేణులు అడుగడుగునా పూలమాలలు వేస్తూ జేజేలు కొట్టారు. అనంతరం తవణంపల్లి విడిది కేంద్రంలో గాండ్ల సామాజిక వర్గీయులతో నారా లోకేష్‌ సమావేశమయ్యారు. కష్టజీవులైన గాండ్ల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. టీడీపీ అధికారంలోకి తేవడానికి మీ వంతు సహకారం అందించాలని వారిని కోరారు.

తవణంపల్లి వద్ద ప్రజలతో మాట్లాడిన లోకేష్‌ సీఎం బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని.. ప్రజలని చూస్తే భయం.. సీబీఐని చూస్తే ఇంకా ఎక్కువ భయపడుతున్నాడన్నారు. బాబాయిని చంపింది అబ్బాయేనని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి.. సైకిల్ రావాలి అని పిలుపునిచ్చారు.

స్థానిక హైస్కూల్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేవని.. కానీ నాడు – నేడు అంటూ హడావిడి చేయడం తప్ప అభివృద్ది లేదన్నారు. ప్రజల్లోకి వచ్చినందుకు నాపై కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా బెదరం, భయపడమన్నారు. కొడాలి నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని.. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.

రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేశారో.. పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎవరు తరిమారో చర్చించడానికి సిద్దమా అని లోకేష్‌ సవాల్‍ విసిరారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ మంత్రి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అడుగడుగునా వైసీపీ నేతలను చెప్పులతో కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.