నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ రెబల్ నేతగా మారిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తాను ఎక్కడా తగ్గేదేలా.. అంటూ.. వరుసగా రెండో రోజు కూడా ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తాను ప్రజల మనిషినని చెప్పిన ఆయన తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. ప్రతి విషయాన్ని ప్రజలతోనే పంచుకుంటానని చెప్పారు. అయితే.. తాజాగా ప్రబుత్వం ఆయనకు 2+2 గా ఉన్న భద్రతను 1+1 గా కుదించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల పక్షాన గళం వినిపించిన తనకు ప్రభుత్వం భద్రతను కుదించడం ద్వారా గిఫ్ట్ ఇచ్చిందని.. ఈ క్రమంలోనే తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నానని చెప్పారు. తనకు ఇప్పుడు ఇచ్చిన 1+1 భద్రతను కూడా తిరస్కరిస్తూ.. దీనినే రిటర్న్ గిఫ్ట్‌గా పంపిస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యల పై తాను ఎప్పటికీ గళం వినిపిస్తూనే ఉంటానని చెప్పారు. వేధింపులను సైతం ఎదుర్కొనే సత్తా తనకు ఉందన్నారు.
నాలుగు రోజులుగా జరుగుతున్న వివాదంలో తప్పు ఎవరిదో అందరికీ తెలిసిందేనన్న కోటంరెడ్డి.. తనదే తప్పయితే.. భగవంతుడు, ప్రజలు కూడా తనను శిక్షిస్తారని వ్యాఖ్యానించారు. ప్రజలు తనను ఎన్నుకొన్నా రని చెప్పారు. ఇక మీదట మరింత కసితో పనిచేయనున్నట్టు కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కడిని చూసి భయ పెట్టాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
తనకున్న గన్‌మెన్లను తగ్గించినంత మాత్రాన తాను భయపడేది లేదన్నారు. తనకు ఈ మధ్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఈ సమయంలో ప్రభుత్వం భద్రత పెంచాలి కానీ, తగ్గించడం ఏంటని నిలదీశారు. ఒంటరిని చేసి.. మానసికంగా భయపెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. మొత్తంగా కోటంరెడ్డి అనూహ్య నిర్ణయం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates