అఖిల‌ప్రియ‌ది… చీటింగ్ మెంటాలిటీ: శిల్పా ఫైర్‌

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా ర‌వి చంద్ర‌కిశోర్ రెడ్డి వ‌ర్సెస్ మాజీ మంత్రి టీడీపీ నాయ‌కురాలు.. భూమా అఖిల ప్రియ‌ల మ‌ధ్య రాజ‌కీయాలు మ‌రింత రాజుకున్నాయి. నీ అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తా.. ఆధారాల‌తో స‌హా నిరూపిస్తా.. అంటూ.. మాజీ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు నంద్యాల‌ను ఒక్క‌సారిగా హీటెక్కించాయి.

ఈ క్ర‌మంలో అఖిల ప్రియ‌ను గృహ నిర్బంధం చేయ‌డం.. ఆమె కోర్టును ఆశ్ర‌యించ‌డం తెలిసిందే. ఇక‌, ఈ క్ర‌మంలో తాజాగా ఎమ్మెల్యే శిల్పా ర‌వి మీడియాతో మాట్లాడారు. అవినీతి చేయాల్సిన అవ‌స‌రం శిల్పా కుటుంబానికి లేద‌న్నారు. ఎవ‌రు అవినీతి ప‌రులో అంద‌రికీ తెలుసున‌ని వ్యాఖ్యానించారు. బ్యాంకుల‌ను మోసం చేసిన‌ చ‌రిత్ర‌, ఇన్ క‌మ్ ట్యాక్స్ అధికారుల వేషంలో బెదిరింపుల‌కు దిగిన చ‌రిత్ర ఎవ‌రివో అందరికీ తెలిసిన‌వేన‌న్నారు.

బ్యాంకుకు 11 కోట్ల రూపాయ‌ల‌కు త‌న‌ఖా పెట్టిన స్థలంలో రియ‌ల్ వెంచ‌ర్ వేసి అమ్మేశార‌ని.. వీటిని కొనుగోలు చేసిన ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు బ్యాంకు నోటీసులు ఇచ్చింద‌ని.. దీని వెనుక భూమా కుటుంబం లేదా? అని నిల‌దీశారు. జ‌గ‌న్ డెయిరీ, విజ‌య డెయిరీల‌ను అడ్డు పెట్టుకుని అవినీతి పాల్ప‌డింది ఎవ‌రో ఆధారాల‌తో స‌హా నిరూపిస్తానంటూ..ఆయ‌న కొన్ని ప‌త్రాల‌ను మీడియాకు చూపించారు.

ఇక‌, భూమా కుటుంబంలోని వారే త‌మ అప్పులు తీర్చాల‌ని రోడ్ల‌ పై ధ‌ర్నాల‌కు దిగిన విష‌యం దాచేస్తే దాగుతుందా? అని ప్ర‌శ్నించారు. తండ్రి చేసిన రాజ‌కీయాల‌ను పుణికి పుచ్చుకున్న కుటుంబం.. త‌ర్వాత‌.. అప్పులు కూడా పుచ్చుకోవాలి క‌దా? వాటిని కూడా తీర్చాలిక‌దా? అని నిల‌దీశారు. తాము అవినీతికి పాల్ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా.. త‌మ కుటుంబం ఉంద‌న్నారు.

హైద‌రాబాద్‌లో భూమి విష‌యంలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు చేశాన‌ని బ‌హిరంగంగా చెబుతున్న అఖిల ప్రియ చేసింది.. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయం కాద‌ని.. చీటింగ్ అని దుయ్య‌బ‌ట్టారు. ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారుల ముసుగు లో చేసింది ఫ్యాక్ష‌న్ ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఇది చీటింగ్ ట్రిక్ కాదా అని నిల‌దీశారు. మొత్తానికి శిల్పా వ‌ర్సెస్ అఖిల ప్రియ ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.