ఎప్పుడెప్పుడు విశాఖకు వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్న ఏపీ ప్రభుత్వం.. దీనికి సంబంధించి ప్రధాన అడ్డంకిగా ఉన్న అమరావతి కేసుల విషయంలో ఎన్నడూలేని విధంగా దూకుడు ప్రదర్శించింది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీలో మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖకు వెళ్లిపోతామని.. విశాఖను రాజధాని చేస్తామని.. వ్యాఖ్యానించారు. ఈ పరిణామం అనంతరం.. రాజకీయంగా సెగ ప్రారంభమైంది. ఇదిలావుంటే.. మరోవైపు.. అమరావతి రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో ఉలిక్కిపడిన ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. రాజధాని అమరావతిపై పెండింగులో ఉన్న అన్ని కేసులను తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రారుకు లేఖ పంపింది. ఆయా కేసులను వెంటనే మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని పేర్కొంది. ఈ నెల 6న మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రారును అభ్యర్థించింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిపై మళ్లీ చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని పేర్కొన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం.. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28న జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31కి వాయిదా పడింది. దీంతో ప్రభుత్వానికి కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చినట్టయింది. అయితే జనవరి 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌ను ఈనెల 6న మెన్షన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని రిజిస్టారును ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే.. ఇదంతా కూడా ఏదో ఒకటి తేల్చుకుని విశాఖకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం లేఖ సంధించిందనే వాదన వినిపిస్తోంది.