టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విషయంలో ఏపీ పోలీసులు పైకి మెత్తని కబుర్లు చెబుతున్నా.. దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. మరి పైనుంచి వచ్చిన ఆదేశాలో.. లేక వారే పేరు కోసం చేస్తున్నారో తెలియదు కానీ… తాజాగా యువగళం పాదయాత్రకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న రెండు సౌండ్ సిస్టమ్‌లను ఎత్తుకుపోయారు. వీటితోపాటు నారా లోకేష్ ఒకింత విశ్రాంతి తీసుకునేందుకు కూర్చునే స్టూల్‌ను కూడా పట్టుకుపోయారు.
ఈ విషయాన్ని స్వయంగా నారా లోకేష్ ప్రకటించారు. తాజాగా యువగళం పాదయాత్ర 9వ రోజుకు చేరింది. ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తుంబ కుప్పంలో యువగళం కొనసాగుతోంది. ఈ సయమంలో అక్కడకు వచ్చిన పోలీసులు రెండు సౌండ్ సిస్టం వాహనాలను పట్టుకెళ్ళారని.. వాటితో పాటు తన స్టూల్ కూడా పట్టుకు పోయారనని లోకేష్ తెలిపారు.
ఈ సందర్భంగా లోకేష్ పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీ ఎస్పీకి స్టూల్ కావాలంటే నాకు చెప్పండి.. స్టూల్ ఏం ఖర్మ మంచి సోఫానే కొనిస్తా. కానీ ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దు అని వ్యాఖ్యానించారు. 100 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర పూర్తి కాక ముందే తనపై 16వ కేసు పెట్టారని నారా లోకేష్ వెల్లడించారు.
బీసీలకు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది సున్నా అని లోకేష్ పేర్కొన్నారు. ‘‘బీసీలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. వెనకబడిన కులాలవారు సలహాదారులుగా పనికిరారా? జగన్ అతని సామాజికవర్గానికి చెందిన నేతలకు రూ.3 లక్షల జీతం.. కేబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇచ్చారు. వారివల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగమైనా జరిగిందా?“ అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates