చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఫోన్‌ల‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా?

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా? అనే సందేహం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. వ‌చ్చేది ఎన్నిక‌ల సీజ‌న్‌ కాబ‌ట్టి.. జ‌గ‌న్ ఈ త‌ర‌హా ప‌నులు చేయొచ్చ‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే సొంత పార్టీ ఎమ్మెల్యేలు రోడ్డున ప‌డ్డార‌ని.. ర‌ఘురామ చెప్పారు.

ఇక‌, ”ప్రజలకిచ్చిన మాట తప్పిన జగన్.. ప్రజాద్రోహి కాదా?” అని రఘురామ ప్రశ్నించారు. సీఎంను ప్రజాప్రతినిధులు ప్రశ్నించవద్దా? జీ హుజూర్ అనాలా? అని ఎంపీ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎవరైనా సరే సీఎం కావచ్చునని జగన్ తెలుసుకోవాలని రఘురామ అన్నారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్‌లు ప్రభుత్వం మానేస్తే మంచిదని సూచించారు.

ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని, గతంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని.. ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన లొకేషన్ కూడా ట్రాక్ చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నార‌న్న‌ అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. గతంలో తనకు వచ్చిన కష్టమే.. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి దృష్టికి కోటంరెడ్డి తీసుకువెళ్లాలని సూచించారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.