వైసీపీలో నేతల మధ్య కొట్లాటలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు అల్లకల్లోలంగా ఉండగా ఇప్పుడు గన్నవరం గరంగరంగా మారింది. గతంలోనూ గన్నవరం పంచాయతీ జగన్ వద్దకు చేరిన తరువాత నివురుగప్పినట్లుగా ఉన్నప్పటికీ తాజాగా మరోసారి గన్నవరం వైసీపీలో గ్రూపుల గొడవ రచ్చకెక్కింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేక గ్రూపుగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగట్ట వెంకటరావులు ఇద్దరూ కొడాలి నాని, వల్లభనేని వంశీ గురించి మాట్లాడిన మాటలు బయటకు రావడంతో వారిపై వంశీ విరుచుకుపడ్డారు.
దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావులు ఎన్నడూ తనకు సహకరించలేదని.. ఇప్పుడు వారి మాటలపై తాము ఫిర్యాదు చేయనవసరం లేదని, ఇంటెలిజెన్స్ ద్వారా అధిష్ఠానానికి ఈపాటికే తెలిసి ఉంటుందని.. అధిష్టానమే చూసుకుంటుందని వంశీ అన్నారు.
కొడాలి నాని, వల్లభనేని వంశీల అక్రమ సంపాదన గురించి దుట్టా, యార్లగడ్డలు మాట్లాడుకున్నది బయటకు రావడంతో ఈ వివాదం మొదలైంది. నాని, తన జోలికి ఎవరు వచ్చినా తామే డీల్ చేసుకుంటామంటూ వంశీ ఆరోపించారు. కడుపులో గుడ్డలు పెట్టేసి కుట్టి మళ్లీ ఆ రోగుల దగ్గర డబ్బులు దండుకునే వారి గురించి మాట్లాడబోనంటూ దుట్టా రామచంద్రరావును ఉద్దేశించి వంశీ తీవ్ర విమర్శలు చేశారు.
అదే సమయంలో ఆయన తనపై ఆరోపణలు చేసేవారు తమ ఇన్కం టాక్స్ రిటర్నులు చూసుకుంటే తాము అక్రమంగా సంపాదిస్తున్నామో సక్రమంగా సంపాదిస్తున్నామో తెలుస్తుందని.. టోక్యోలో చూస్తే, న్యూయార్క్.. న్యూయార్కులో చూస్తే టోక్యో కనిపించే మనుషులకు ఇలాంటి రిటర్నులు కనిపించవంటూ దుట్టా రామచంద్రరావునుద్దేశించి వంశీ అన్నారు. దుట్టా రామచంద్రరావురకు మెల్ల కన్ను కావడంతో ఆయన్నుద్దేశించి వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దుట్టా, యార్లగడ్డలు ఇద్దరూ తన చేతిలో ఓడిపోయినవారేనని.. వారిద్దరూ తనకు ఎన్నడూ సహకరించలేదని… ఇప్పుడు కూడా తనకు సహకరించడం వారికి ఇష్టం లేకపోతే తనకు నష్టం లేదని వంశీ అన్నారు.
కాగా 2019, 2014లో వంశీ గన్నవరం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో దుట్టా రామచంద్రరావు వైసీపీ అభ్యర్థిగా వంశీ చేతిలో ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు 990 ఓట్ల స్వల్ప తేడాతో వంశీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ అనంతరం వైసీసీలో చేరారు. దీంతో అప్పటి నుంచి యార్లగడ్డ, దుట్టా వర్గాలకు వంశీకి పొసగడం లేదు. దీంతో రెండు వర్గాలనూ పిలిచి జగన్ మాట్లాడి పంపించినా విభేదాలకు మాత్రం తెరపడడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates