సెంట్ర‌ల్ బ‌డ్జెట్‌: ఇంత‌కీ జ‌గ‌న్ సాధించిందేంటి?

బ‌డ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ప్ర‌వేశ‌పెట్టారు. సుదీర్ఘ ప్ర‌సంగం.. కొన్ని చ‌లోక్తులు.. మ‌రి కొన్ని స్వోత్క‌ర్ష‌లు మిన‌హా.. ఈ బ‌డ్జెట్‌లో రాష్ట్రాల ప్ర‌స్తావ‌న పెద్ద‌గా లేదు. అయితే.. ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ఏపీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే.. బ‌డ్జెట్ వంట‌కానికి ముందు దాదాపు మూడు మాసాల నుంచి కూడా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఢిల్లీలోనే మ‌కాం వేశారు. ఆర్థిక శాఖ టు.. ఏపీ భ‌వ‌న్ అంటూ.. నిత్యం ఆయ‌న కారులో తిరిగి.. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అక్క‌డే కూర్చుని ఏపీకి ఇది కావాలి.. అది కావాలి.. అని ప్ర‌స్తావించారు. ఈ క‌ష్టాన్ని మ‌నం గుర్తించాలి!

ప్ర‌ధానంగా విశాఖ‌లో భారీ ఎత్తున డెవ‌ల‌ప్ మెంట్ కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించిన‌ట్టు అప్ప‌ట్లోనే జాతీయ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఎందుకంటే విశాఖ‌ను పాల‌నా రాజధాని చేయాల‌ని భావిస్తున్న వైసీపీకి ఇది చోద శ‌క్తిగా మారుతుంద‌నే అంచ‌నాలు ఉండి ఉండొచ్చు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. పోల‌వ‌రం ప్రాజెక్టును ఎన్నిక‌ల‌కు ముందైనా ప‌రుగులు.. ఉరుకులు పెట్టించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించిన మాట‌ను కూడా విస్మ‌రించ‌లేం. ఆయ‌న కానీ, ఆయ‌న మంత్రి బుగ్గ‌న కానీ.. ఢిల్లీకి వెళ్లిన‌ప్పుడు ప్ర‌తిసారీ పోల‌వ‌రం గురించి చెప్పారు.

ఇక‌, బ‌డ్జెట్‌కు ముందు కూడా బుగ్గ‌న ప్ర‌త్యేకంగా నిర్మ‌లా సీతారామ‌న్‌ను క‌లిసి.. పోల‌వ‌రం గురించి ప్ర‌స్తావించారు. స‌వ‌రించిన అంచ‌నాల మేరకు ప్రాజెక్టుకు రూ.57,638 కోట్ల‌ను కేటాయించాల‌ని ఆయ‌న అనేక సార్లు అభ్య‌ర్థించారు. ఇవి కాకుండా.. నూత‌న జిల్లాల‌ను ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో మౌలిక సదుపాయాల కోసం.. ప్ర‌త్యేక నిధులు కేటాయించాల‌ని కోరారు. మ‌రి.. ఇప్పుడు తాజాగా.. ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏమేర‌కు.. జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు? ఏమేర‌కు బుగ్గ‌న అభ్య‌ర్థ‌న‌లు ఫ‌లించాయి? అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే.. ఏపీ గురించిన ప్ర‌స్తావ‌న కేవ‌లం మొత్తం ప్ర‌సంగంలో 2 నిమిషాల‌లోపే ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఏపీకి ఇచ్చిన వాటిని చూస్తే..

  • ఆంధ్రప్రదేశ్ సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.47 కోట్లు
  • పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.683 కోట్లు
  • మంగళగిరి ఎయిమ్స్‌తో పాటు దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆస్పత్రులకు రూ.6,835 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41,338 కోట్లు
  • పోలవరం ప్రాజెక్ట్ పేరుని కూడా బ‌డ్జెట్‌ కనీసం ప్రస్తావించలేదు.
  • వైజాగ్‌ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించలేదు
  • వెనుక‌బ‌డిన జిల్లాల ప్ర‌స్తావ‌న కూడా లేదు
  • కొత్త జిల్లాల్లో మౌలిక స‌దుపాయాల‌కు రూపాయి కేటాయించ‌లేదు.