జగన్ వ్యూహం అదిరిందిగా

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌.. తాజాగా చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై విశ్లేష‌కులు త‌మ మెద‌ళ్ల‌కు ప‌దును పెంచారు. విశాఖ‌ప‌ట్నం రాజ‌ధాని త్వ‌ర‌లోనే ఏర్పాటు చేస్తున్నామ‌ని.. త్వ‌ర‌లోనే తాను కూడా విశాఖ ప‌ట్నానికి వెళ్లిపోతున్నాన‌ని.. ఇదంతా కూడా రెండు మూడు రోజుల్లోనే జ‌రిగిపోతుంద‌ని పెద్ద ఎత్తున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఇంత స‌డెన్‌గా సీఎం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకు? అనేది ప్ర‌శ్న‌.

ఢిల్లీలో ఉన్న సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌పంచ పెట్టుబ‌డి దారుల స‌న్నాహ‌క స‌మావేశంలో మాట్లాడారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అవ‌కాశాల‌ను చెప్పుకొంటే స‌రిపోయేది. అదేవిధంగా విశాఖ‌ను పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామం అని కూడా చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేసి ఉంటే బాగుం డేది. కానీ, ఈ విష‌యాల‌ను మ‌రిచిపోయారో.. లేక వుద్దేశ‌పూర్వ‌కంగానే ప‌క్క‌న పెట్టారో .. మొత్తానికి విశాఖ‌ను రాజధానిని చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

అయితే.. ఈ కామెంట్ల వెనుక‌.. జ‌గ‌న్ చాలా మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేంటంటే .. ప్ర‌స్తుతం.. సీఎం జ‌గ‌న్ బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించ డం.. ఆవెంట‌నే ఆయ‌న‌ తాను హ‌త్య జ‌రిగిన త‌ర్వాత‌.. కొంద‌రితో మాట్లాడాన‌ని చెప్ప‌డం.. ఈ లింకులు చూస్తే.. ఇవ‌న్నీ.. సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న భార్య భార‌తి చుట్టూ త‌గులుకోవ‌డం.. విజ‌య‌వాడలో న‌వీన్ వ్య‌క్తి చుట్టూ తిర‌గ‌డం.. వంటివి మీడియాలో హైలెట్ అయ్యాయి.

మొత్తంగా చూస్తే.. ఈ ప‌రిణామాలు సీఎం జ‌గ‌న్‌ను చుట్టుముట్టాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న భార్య చుట్టూ కూడా తిరుగుతున్నాయి. దీంతో ఈ కాక నుంచి త‌ప్పించుకునేందుకు సీఎం జ‌గ‌న్‌.. అనూహ్యంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ వ్యాఖ్య‌ల ద్వారా.. మీడియా ఫోక‌స్ స‌హా.. రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌క్షాలు… ప్ర‌తిప‌క్షాలు.. ప్ర‌జాసంఘాలు.. రాజ‌ధాని రైతులు కూడా.. పెద్ద ఎత్తున కౌంట‌ర్లు ఇస్తాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికి త‌న‌పై ఉన్న ప్ర‌చారం ప‌క్క‌దారి ప‌డుతుంద‌నే వ్యూహం వేసి ఉంటార‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.