ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని.. దేశ ప్రవేశ పెట్టబోయే తాజా బడ్డెట్ వైపు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత బడ్జెట్ సామాన్య పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు.
ప్రపంచానికి ఆశాకిరణంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. సమావేశాల ప్రారంభంలోనే ఆర్థిక నిపుణుల నుంచి సానుకూల సందేశాలు వస్తున్నాయన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సమర్పించనున్న బడ్జెట్.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా.. ప్రపంచం భారతదేశంపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా పెంపొందిచేలా కృషి చేస్తుందని ప్రధాని తెలిపారు.
ఈ రోజు చాలా ముఖ్యమైనదని పేర్కొన్న ప్రధాని, రాష్ట్రపతి మొదటిసారిగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం భారత రాజ్యాంగానికి, భారత పార్లమెంటరీ వ్యవస్థకు, మహిళలకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలోని గొప్ప గిరిజన సంప్రదాయాలను గౌరవించేందుకు ఇది ఒక అవకాశమని తెలిపారు.
‘ఇండియా ఫస్ట్, సిటిజెన్ ఫస్ట్’ అనే నినాదంతో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అని మోడీ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రపంచం మొత్తం చూస్తున్న ఆశాకిరణం ప్రకాశిస్తుందని.. దాన్ని నెరవేర్చడానికి నిర్మలా సీతారామన్ అన్ని ప్రయత్నాలు చేస్తారని బలంగా విశ్వసిస్తున్నానని ప్రధాని వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates