ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీకి పాలనా రాజధాని అవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త్వరలోనే తాను విశాఖ పట్నానికి మకాం మారుస్తున్నట్టు కూడా చెప్పేశారు. విశాఖకు పెట్టుబడుల వరద పారాలని తాము కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీనేనని ఆయన తెలిపారు. ప్రపంచ వేదికలపై ఏపీని నిలబెట్టడానికి శతథా కృషి చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లింది. కాగా, ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. అనుమతుల నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. అదేసమయంలో రాజధాని విషయాన్ని అనూహ్యంగా ఆయన ప్రస్తావించారు. రాజధాని సహా.. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా విశాఖకు తరలి పోతుందని.. దీనికి ఎంతో సమయం లేదని వ్యాఖ్యానించారు. అయితే.. ఒకవైపు ఈ రోజు సుప్రీంలో అమరావతి రాజధాని పిటిషన్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates