పాలక వైసీపీ లో రోజురోజుకూ అసమ్మతి పెరుగుతోంది. పార్టీ అధిష్ఠానం తీరుపై సీనియర్ నేతల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలు పార్టీని వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండడంతో వైసీపీ పెద్దలలో కలవరం మొదలైంది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల ప్రభుత్వం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆనం వ్యాఖ్యల తర్వాత నియోజక వర్గంలో ఆయనకు ప్రాధాన్యతను తగ్గించారు. దీంతో ఆయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటు న్నట్లు తెలుస్తోంది.
ఆనంతో పాటు మరో బలమైన కుటుంబానికి చెందిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. అందుకు తగ్గట్టే గత కొంతకాలంగా మాగుంట దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటించే సందర్భంలోనూ మాగుంట ముఖం చాటేస్తున్నారు. ప్రత్యేకించి జిల్లాలో ఆయనకు తగిన ప్రాధాన్యతను కల్పించకపోవడం, సొంత పార్టీ నేతలు సైతం స్థానిక ఎంపీగా తగిన గౌరవాన్ని ఇవ్వకపోవడం, తదితర కారణాలు వెరసి ఆయన వైసీపీపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ఆనం, మాగుంటలు త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
కాగా ఆనం నెల్లూరులో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. నెల్లూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన తమ అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి పార్టీ మారే విషయంపై నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఆయన సొంత పార్టీ, ప్రభుత్వం, సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం.. ఆ తరువాత జగన్ పిలిసపించి మాట్లాడడం జరిగినా కూడా తాజాగా కోటంరెడ్డి మరోసారి మండిపడ్డారు. ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టారని… తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. వైసీపీని వీడాలని నిర్ణయించుకోవడం వల్లే ఆయన ఈ స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన టీడీపీలో చేరడం కష్టమేనని… ఒకవేళ ఆయన్ను టీడీపీలో చేర్చుకుంటే స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుందన్నది చంద్రబాబుకు కూడా తెలుసు. మరోవైపు సుజనాచౌదరితో కోటంరెడ్డి కాంటాక్టులో ఉన్నారన్న ప్రచారం జరుగుతుండడంతో ఆయన బీజేపీలో వెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోంది.