ఇదేదో.. పార్టీ కార్యకర్తలో కీలక నేతలో ఇచ్చిన పిలుపుకాదు. సాక్షాత్తూ.. ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేయాల్సిన ఓ అధికారి.. డ్వాక్రా మహిళలకు జారీ చేసిన సంచలన ఆదేశాలు. అంతేకాదు.. ఇలా చేయకపోతే.. భవిష్యత్తులో మీకు రుణాలు దక్కవు! అని కూడా ఆదేశాలు ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఆదేశాలు వైరల్ అవుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా మందస మండల ఏపీఎం ప్రసాదరావు.. మంత్రి అప్పలరాజుపై స్వామిభక్తిని చాటుకున్నాడు. తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి అనే మాట మరిచిపోయి మరీ.. మంత్రిగారు వస్తారు.. ఆయనపై పూల జల్లు కురిపించండి.. అంటూ డ్వాక్రా మహిళలకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు.. సీఎం జగన్, మంత్రి అప్పలరాజుపై ఏపీఎం చేసిన పొగడ్తల వర్షం.. స్థానిక మహిళలను ఆశ్చర్యానికి గురిచేసింది.
శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం(మంత్రి సీదిరి సొంత నియోజకర్గం) జిల్లుండ గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకోసం సన్నద్దం కావాలంటూ.. డిమిరియా గ్రామంలో డ్వాక్రా మహిళలతో ఏపీఎం ప్రసాదరావు సమావేశమయ్యారు. మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మంత్రి వచ్చినప్పుడు ఇలా చేయండి.. అలా చేయండని సూచించారు.
మంత్రి వస్తున్న కార్యక్రమానికి పట్టు చీరలు కట్టుకుని రావాలని ఆదేశించారు. మంత్రి రాగానే ఆయనపై పూలు చల్లాలని, నవ్వుతూ ఉండాలని వారికి సూచనలిచ్చారు. కుదిరితే ఒకరిద్దరు హారతులు పట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా మంత్రి సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలో చప్పట్లు కూడా కొట్టాలని ఆదేశాలు చేశారు. ఇదంతా చూసిన సమావేశంలో కొందరు మాహిళలు, గ్రామస్థులు ఆయనపై విమర్శలు చేశారు. అసలు ప్రభుత్వ ఉద్యోగా, వైసీపీ కార్యకర్తవా అని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన సదరు అధికారి.. ఆ మహిళల వివరాలను నమోదు చేసుకుని వెళ్లడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates