ఏపీలో ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు మరోసారి రిపీట్ అయిందనే వాదన వినిపిస్తోంది. పోలీసులకు.. టీడీపీకి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం.. తరచుగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం.. కేసులు పెట్టడం.. మరోవైపు, టీడీపీ నేతలు పోలీసులపై కామెం ట్లు కుమ్మరించడం. ఈ రెండు విషయాల్లోనూ ఇరు పక్షాలు తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమ నార్హం.
మరోవైపు, తాజాగా యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా.. టీడీపీ వర్సెస్ పోలీసులకు మధ్య వివాదం రాజుకుంది. అచ్చన్నాయుడు పోలీసులపై విరుచుకుపడడం.. ఆ వెంటనే పోలీసులు కూడా అదే రేంజ్ లో రియాక్ట్ కావడం.. రాజకీయంగా విమర్శలకు తావివ్వడమేకాకుండా.. ఇరు పక్షాల మధ్య దూరాన్ని కూడా పెంచేసింది. అయితే.. ఈ వివాదాలు ఎప్పటి వరకు ? అనేదే ఇప్పుడు ప్రశ్న.
మరోవైపు.. పోలీసులతో రాజీ పడేది లేదని టీడీపీ నేతలు, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు, అంతేకాదు, ఇలా అయితే ప్రజాక్షేత్రంలో తిరగలేరని ప్రకటనలు వంటివి ఏపీలో టీడీపీ వర్సెస్ పోలీసు రాజకీయాలను వేడెక్కించాయి. వచ్చే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ యాత్రలు, చర్చల పేరిట రాజకీయాలను వేడెక్కించిన నేపథ్యంలో ఈపార్టీకి పోలీసుల సహకారం కూడా అవసరం.
ఇక, పోలీసులు ప్రతిపక్షమా, అధికార పక్షమా.. అనేది కాకుండా చట్టప్రకారం.. నిబంధనలను అనుసరించి విధులు నిర్వహించాల్సిన అగత్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా వేడెక్కిన వాతావరణం లో రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ఇరు పక్షాలు కూడా సంయమనం పాటించి.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. సో.. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. ఇరు పక్షాలూ వ్యవహరించాలనేది పరిశీలకుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates