లేటెస్ట్ స‌ర్వే దెబ్బ‌తో వైసీపీలో క‌ల‌క‌లం…!

తాజాగా ఇండియాటుడే – సీ ఓట‌రు స‌ర్వేలో.. సీఎం జ‌గ‌న్ వెనుక‌బ‌డిన‌ట్టుగా వ‌చ్చిన రిపోర్టు వైసీపీలో క‌ల‌క లం రేపుతోంది. దీనిని చాలా మంది నాయ‌కులు విశ్వ‌సించ‌డం లేదు. ఇది నిజం కాదు.. ఎవ‌రో ఉద్దేశ పూర్వ‌కంగా చేస్తున్న వాద‌న.. చేయించిన స‌ర్వే! అంటూ.. వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. వీరు చెబుతున్న వాద‌న కూడా కొంత విశ్వ‌స‌నీయంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రుల పాల‌న‌పై గ‌త ఏడాది.. ఇండియాటుడే-సీ ఓట‌రు స‌ర్వే చేసింది. వారి విష‌యంలో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ప్ర‌జల నాడి ఎలా ఉంది? అనేకీల‌క విష‌యాల పై ఈ స‌ర్వే సాగింది. ఈ స‌ర్వేలో య‌థాప్ర‌కారం ఒడిసా ముఖ్య‌మంత్రి నవీన్ ప‌ట్నాయ‌క్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నారు. అయితే.. గ‌త రెండేళ్ల కాలంలో తొలి ఐదు స్థానాల‌లో ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్ ఈ సారి మాత్రం 10వ స్థానంలో ఉన్నార‌నేది స‌ర్వే సారాంశం.

దీనికి ప్ర‌తిప‌క్షాలు, అనుకూల మీడియా పెద్ద‌గా ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. ఇంత స‌ర్వే చేసిన సీ-ఓటరు.. పొరుగున ఉన్న తెలంగాణ‌ను మాత్రం ప‌ట్టించుకోలేదు. వాస్త‌వానికి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ చేసి, జాతీయ‌స్థాయిలో రాజ‌కీయాలు చేయాల‌ని భావిస్తున్న కేసీఆర్ గురించి మాట మాత్రంగా కూడా ఈ స‌ర్వేలో పేర్కొన‌లేదు. అంతేకాదు.. ఈ ఏడాది ఈ రాష్ట్రంలో ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి.

అలాంటి కీల‌క రాష్ట్రాన్ని ఎందుకు విస్మ‌రించారు. అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రోవైపు, సీఎం జ‌గ‌న్ విష‌యంలో ఇంత భారీ వ్య‌తిరేక‌త ఎందుకు వ‌చ్చింద‌నేది వైసీపీ నాయ‌కుల సందేహం. అనేక ప‌థ‌కాలు ఇస్తున్నారు…అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా అమ‌లు చేస్తున్నారు… అయినా.. ఇంత వ్య‌తిరేకత ఎందుకు ఉంటుంది? ఇదంతా కూడా ఉద్దేశ పూర్వ‌కంగా చేస్తున్న ప్ర‌చార‌మ‌నేది వైసీపీ నేత‌లు చెబుతు న్నమాట‌.