ఇటు ప్రజల్లోను, అటు పార్టీలోనూ దేవుడుగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఇక లేరు. కిడ్నీ మార్పిడితో కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వట్టి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వసంత్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వట్టి భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం సొంత గ్రామం పూండ్లకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం పూండ్లలో వసంత్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలావుంటే.. నిబద్ధతకు పెద్దపీట వేసిన వట్టి వసంత్‌కుమార్.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో లేకపోయినా.. ఉన్న తక్కవు సమయంలోనే ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు.
ఎలాంటి అవినీతి మరకలు లేకుండా.. భేషజాలకు పోకుండా.. పాలిటిక్స్ చేసిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. వసంత్‌కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల. ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వరుస విజయాలు అందుకున్నారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
వైఎస్ పాదయాత్రకు సంఘీభావంగా పశ్చిమ గోదావరి నుంచి ఇచ్చాపురం వరకు ఈయన కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలోనే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి హయాంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎక్కడా ఒక్క రూపాయి తీసుకోకుండా.. ఎలాంటి ఆరోపణలు లేకుండా.. పనిచేయడం విశేషం.
పైగా.. తన నియోజకవర్గంలో వట్టిని దేవుడు మంత్రి అని ప్రజలు అభిమానంగా పిలుచుకునేవారు. ఆయన దగ్గరకు వెళ్తే.. కాని పనంటూ లేదనే టాక్ అప్పట్లో జోరుగా వినిపించేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి కాంగ్రెస్ పార్టీతో పాటు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో కనుమూరి బాపిరాజు.. వంటి నేతల వరుసలో నిలిచిన ఏకైక నాయకుడుగా వట్టి పేరు తెచ్చుకున్నారు.