ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పుకాదు. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అయితే.. ప్రభుత్వ పెద్దల పక్కనే వారితో రాసుకునిపూసుకుని కూర్చుని వారిపై నిప్పులు చెరిగితే.. ఎలా ఉంటుంది? విమర్శలు చేస్తే.. ఏం జరుగుతుంది. అసలు ఈ దేశంలో ఇప్పటి వరకు జరగని ఘటన ఒకటి కర్ణాటకలో జరిగింది. ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న ఓ స్వామీజీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం.. అంతే వేగంగా రియాక్ట్ అయ్యారు.
కర్ణాటకలోని మహదేవపురలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీతో పాటు ముఖ్యమంత్రి బసవరాజ బమ్మై కూడా పాల్గొన్నారు. తొలుత స్వామిజీకి మైకు ఇచ్చారు. దీంతో ఆయన రెచ్చిపోయారు. బెంగళూరులో సరైన మౌలిక సదుపాయాలు లేక నగరవాసులు పడుతున్న అవస్థలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు స్వామీజీ. అలాగే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చెత్త పాలన సాగుతోందన్నారు.
“బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారు. ఇవన్నీ మేం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా? సీఎం కూడా దీని గురించి గతంలో హామీలు ఇచ్చారు. అయినా.. ఒక్కటీ పరిష్కరించలేక పోయారు” అని స్వామీజీ నిప్పులు చెరిగారు.
అయితే.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం బొమ్మై.. స్వామీజీ ఇంకా ఏదో మాట్లాడుతుండగానే మైకును చేతుల్లో నుంచి లాగేసుకున్నారు. “కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని కాదు నేను. అది కేవలం హామీ మాత్రమే కాదు. దానిపై మేం ఓ పథకం తీసుకొచ్చాం. నిధులు కూడా కేటాయించాం. పని జరుగుతోంది” అని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. స్వామీజీ నుంచి సీఎం మైకును లాక్కుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.