భ‌యం నా బ‌యోడేటాలో లేదు: నారా లోకేష్‌

సుదీర్ఘ పాద‌యాత్ర‌ను ప్రారంభించిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాగ‌ళం వినిపించేందుకే తాను పాద‌యాత్ర ప్రారంభించాన‌ని చెప్పారు. అంతేకాదు, ఎవ‌రికీ తాను త‌ల ఒంచేది లేద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం.. తాను ప్ర‌జాక్షేత్రంలోకి అడుగులు వేశాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ‘యువ‌గ‌ళం ఆపేస్తామ‌ని.. కొంద‌రు మొరుగుతున్నారు. వారికి నేను భ‌య‌ప‌డేది లేదు. భ‌యం అసలు నా బ‌యోడేటాలోనే లేదు’ అని లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

యువగళం ప్రజాబలమని, యువగళం పేరు వినగానే వైసీపీ నేతల ప్యాంట్లు తడిచాయని లోకేష్ ధ్వజమెత్తారు. పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తు చేస్తూ.. మూడున్నరేళ్లుగా వైసీపీ నేతలు ఏం పీకారని సూటిగా ప్రశ్నించారు. తన యువగళం ఓ పాదయాత్ర మాత్రమే కాదు, యువతకు పోరాడే వేదిక అని లోకేష్ స్పష్టం చేశారు. యువత ను మోసం చేసిన జాదూ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.

మైసూర్ బోండాలో మైసూర్ లేనట్లే జాదూ రెడ్డి జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు లేవని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కంచుకోటకు మారుపేరు కుప్పం అని వెల్లడించారు. యువగళం ప్రజా బలమన్నారు. క్యాసినోలు పెడితే పరిశ్రమలు రావని వైసీపీ నేతలు గుర్తించాలని హితవు పలికారు. గ‌త 3ఏళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని సీఎం జ‌గ‌న్‌ను దుయ్యబట్టారు. యువత, రైతులు మహిళలు ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వ బాధితులేనన్నారు.

ఇదిలావుంటే, నారా లోకేష్ ప్రారంభించిన పాద‌యాత్ర‌కు అనూహ్య‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఎన్నారైలు ఆన్‌లైన్‌లో స్పందిస్తూ.. నారా లోకేష్ పాద‌యాత్ర‌.. జ‌గ‌న్‌కు ఆయ‌న మంత్రుల‌కు పాడి యాత్ర అవుతుంద‌ని.. మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్లు ఇచ్చారు. అంతేకాదు.. పాద‌యాత్ర గ‌తంలో జ‌గ‌న్ కూడా చేశార‌ని.. మ‌రి దాన్ని ఏమ‌ని పిల‌వాల‌ని వ్యాఖ్యానించారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని.. లోకేష్ పాద‌యాత్ర‌ను పాడి యాత్ర‌గా అభివ‌ర్ణించ‌డంపై.. ఎన్నారైలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.