నేల ఈనిందా.. నింగి వంగిందా.. అని 1983 ప్రాంతంలో తెలుగు వారి అన్నగారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి నప్పుడు అని తరచుగా అనేవారు. ఇప్పుడు అది మరోసారి అక్షర సత్యం అయింది. తాజాగా.. టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ప్రారంభించిన యువగళం పాదయాత్రకు కూడా అంతే స్పందన వచ్చింది. భారీ ఎత్తున ప్రజలు, పార్టీ అభిమానులు కుప్పానికి పోటెత్తారు. “ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు ఈ యువగళం ప్రారంభించా” అని లోకేష్ చాటి చెప్పారు.
తొలుత చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. తొలి అడుగు వేశారు. యువత భవిత, ఆడబిడ్డల రక్షణ కోసం, అవ్వా తాతల బాగోగుల కోసం.. దగా పడ్డ వివిధ వర్గాలకు తోడు కోసం అంటూ ఈసందర్భంగా నారా లోకేష్ తన యువగళంపై ప్రకటించారు. ఈ పాదయాత్రలో మొత్తం 4వేల కిలోమీటర్ల మేర లోకేష్ నడవనున్నారు.
సరిగ్గా 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను కళ్లారా లోకేష్ చూడనున్నారు. కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. లోకేష్ పాదయాత్రకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ట్రాఫిక్‌లో ఇరుక్కున్న బాలయ్య..
ఎమ్మెల్యే, టీడీపీ కీలక నాయకుడు, నందమూరి బాలకృష్ణ.. యవగళం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే.. ఆయన కుప్పంలో ట్రాఫిక్ జామ్ అవ్వటంతో ద్విచక్ర వాహనంపై ఆలయం వద్దకు వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు కుప్పం వచ్చి యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నేతలతో కలిసి లోకేష్ ముందుకు కదిలారు. మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.