ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 26 ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. అదే సమయంలో మరో ఏడు నియోజకవర్గాలు.. ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. గత ఎన్నికలను పరిశీలిస్తే.. ఏడు ఎస్టీ నియోజకవర్గల్లోనూ.. వైసీపీ విజయం దక్కించుకుంది. ఒక ఎస్సీ నియోజకవర్గం(రాజోలు) లో జనసేన గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఆ తర్వాత.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. పార్టీకి దూరమయ్యారు. మరోవైపు.. టీడీపీ కొండపి ఎస్సీ నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కింది.
అంటే.. మొత్తంగా 26 ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ ఒకటి, జనసేన 1 దక్కించుకోగా.. వైసీపీ మొత్తంగా 24 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, 7 ఎస్టీ నియోజకవర్గాలను కూడా వైసీపీ దక్కించుకుని అఖండ మెజారిటీతో దూసుకుపోయింది. అయితే.. ఇప్పుడు ఇవే నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఆ 26, ఈ 7 నియోజకవర్గాల్లో మళ్లీ అదేరేంజ్ విజయం సాధ్యమేనా? అనేది ప్రశ్న. ఈ విషయాన్ని కొంత లోతుగా పరిశీలిస్తే.. ఫిఫ్టీ-ఫిఫ్టీగా పరిస్థితి ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. ఎస్టీ నియోజకవర్గాలు తీసుకుంటే.. ఇప్పటికీ పాలకొండ, అరకు, కురుపాం వంటి నియోజకవర్గాల్లో ప్రజలకు మౌలిక వసతులు లేకుండా పోయాయి. నిజానికి గత ఏడాది ఏప్రిల్‌లో తీసుకువచ్చిన జిల్లాల విభజన ద్వారా..ఈ నియోజకవర్గాల్లో పుంజుకోవడంతోపాటు.. పార్టీని పరుగులు పెట్టించాలని అనుకున్నారు. అంతేకాదు.. ఈ నియోజకవర్గాల్లో జిల్లాల విభజన కారణంగా అభివృద్ధిని కూడా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని భావించారు.
కానీ.. అనుకోవడమే తప్ప.. ఇప్పటి వరకు కార్యాచరణ ప్రకటించింది ఏమీ కనిపించడం లేదు. దీంతో ఎస్టీ వర్గాలు చిన్న పాటి వైద్యానికి కూడా సుదూర ప్రాంతాలకు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఇక, ఎస్సీ వర్గాల విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గాల్లో నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయాయి. ఉదాహరణకు తిరువూరు, పామర్రు, తాడికొండ, ప్రత్తిపాడు వంటి అనేక నియోజకవర్గాల్లో ఇద్దరికి మించిన నాయకులు.. టికెట్ పోరులోఅవిశ్రాంతంగా కాలం గడుపుతున్నారు. ఇలా ఏవిధంగా చూసుకున్నా.. వైసీపీకి కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates