400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర కోసం టీడీపీ శ్రేణులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మాట వాస్తవం ప్రతీ ఊరు, ప్రతీ వాడలో లోకేశ్ రాక కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు యువగళం గీతాన్ని ఆలాపించేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 27న (శుక్రవారం) ప్రారంభమవుతున్న యాత్ర ఏడాదిపైగా జరుగుతుంది. అంటే అంత కాలం కుటుంబ సభ్యులకు దూరమై నారా లోకేష్ జనం కోసం తిరుగుతారు.
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ..
లోకేష్ కు ఇదీ ఒక రాజకీయ అనుభవం. ప్రతీ ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగే అవకాశం, స్థానిక సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగాల్సిన తరుణం. ఇచ్చిన హామిలను నెరవేరుస్తారన్న విశ్వాసాన్ని కలిగించాల్సిన సమయం.
నిజానికి లోకేష్ కు ఇదో మిషన్. అదే మిషన్ ఆంధ్రప్రదేశ్ . ఏపీలో అసమర్థ జగన్ పాలనను గద్దె దించి ప్రజారంజక ప్రభుత్వాన్ని కోటలో పాగా వేయించేందుకు లోకేష్ తొలి సంకల్పమే యువగళం పాదయాత్ర అని చెప్పుకోవాలి. ప్రస్తుత పాలకుల పట్ల జనం విసిగిపోయారు. సమర్థ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో లాగే మరోసారి తాము మాత్రమే సమర్థ నాయకత్వం అందించగలమని లోకేష్ చెప్పుకోవాలి. అదీ టీవీ చర్చలు, పేపర్ ప్రకటనలతో కుదరని పని అని తేలిపోయింది. అందుకే వీధివీధికి వెళ్లి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేందుకే లోకేష్ మిషన్ ఆంధ్రప్రదేశ్ ను ప్రారంభించారని చెప్పుకోవాలి.
భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే ప్రజల కోసం లోకేష్ ఎలా పనిచేస్తారన్నది పెద్ద ప్రశ్నే. ఆ ప్రశ్నకు సమాధానం వెదికే పనిగానే లోకేష్ బహుదూరపు బాటసారిగా మారారనే చెప్పాలి. చిత్తూరు సమస్యలు ఒక రకంగా ఉంటాయి. శ్రీకాకుళం సమస్యలు మరో రకంగా ఉంటాయి. అనంతపురం ప్రజల ఆలోచనలకు, బెడవాడ వారి దూకుడుకు తేడా ఉంటుంది. అన్నింటినీ అర్థం చేసుకుంటేనే పరిణితి ఉన్న నాయకుడిగా లోకేష్ ఎదిగే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులను దగ్గరయ్యేందుకు కూడా యువగళం పాదయాత్ర ఉపయోగపడుతుంది. ఇప్పటికే లోకేష్ కు చాలా మంది పర్సనల్ గా తెలుసు. కనిపించిన వెంటనే పేరు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి కూడా ఉంది. పార్టీ అన్నది ఓ సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని నీళ్లు తాగినా తరిగిపోనట్లుగా పార్టీలోకి జనం వస్తూనే ఉంటారు. కార్యకర్తలను పరిచయం చేసుకునేందుకు కూడా యువగళం పాదయాత్ర పనికొస్తుందని చెప్పాలి..
చంద్రబాబు వ్యూహాత్మక దూరం
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగానే యువగళం పాదయాత్రకు దూరం జరిగారు. కనీసం పబ్లిసిటీ ప్రోమోలో కూడా తన పేరు కనిపించకూడదని ఆదేశించారు. యాత్రలో ఎక్కడా ఆయన ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. యాత్ర మొత్తం లోకేష్ నాయకత్వంలో జరగాలని ఆయన భావిస్తున్నారు. లోకేష్ కు అనుభవం వస్తేనే పార్టీకి ఆయన వారసుడిగా ఉంటారని చంద్రబాబు విశ్వాసం. అందుకే హైదరాబాద్ లో ఆశీర్వదించి లోకేష్ ను ఏపీకి పంపారు. ఇక యువగళం ఓ జైత్ర యాత్ర అవుతుందో లేదో చూడాలి…
Gulte Telugu Telugu Political and Movie News Updates