సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు సెల్యూట్ కొడుతున్న ఈ ముఖ్యమంత్రి గతంలో ఓ ఎస్సైని కొట్టారని పవన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. పులివెందులలో ఓ ఎస్ఐని జైల్లో పెట్టి మరీ జగన్ కొట్టారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అటువంటి జగన్ చేతిలో ఇప్పుడు పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ఉన్నాయని పవన్ విమర్శించారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న భావన వైసీపీ నేతలకు లేదని, మెడలు వంచి వారు అలా ఉండేలా చేస్తానని పవన్ హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ పైనే జగన్ కు గౌరవం లేదని, అటువంటి జగన్ కు పోలీసులు సెల్యూట్ చేస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు పవన్. ఎందరో మహానుభావుల త్యాగం వల్లే ఈరోజు మనం భారతీయులమని గర్వంగా ఫీల్ అవుతున్నామని అన్నారు.
తన పిల్లల కోసం తాను మూడు కోట్ల రూపాయలు దాచి పెట్టానని, ఆ డబ్బుతో జనసేన ఆఫీసు కట్టానని పవన్ చెప్పుకొచ్చారు. తన పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని పవన్ చెప్పారు. తనకు చట్టాలంటే గౌరవం ఉందని, వాటికి అతీతంగా కోడి కత్తి డ్రామాలు చేయబోనని జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వారాహి వాహనాన్ని రాష్ట్రంలో అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ఈ విధంగా ఘాటుగా స్పందించారు.
ప్రస్తుతం ప్రపంచంలో కమ్యూనిస్టు, రైట్ వింగ్ కలిసిన విధానం మధ్యస్థంగా ఉందని, దాన్ని తాను ఎంచుకున్నానని చెప్పారు. అయితే, దాని వెనక వ్యక్తిగత ఎజెండా ఏది లేదని క్లారిటీనిచ్చారు. తనతో సహా ఎవరిని గుడ్డిగా ఆరాధించొద్దంటూ ఫ్యాన్స్ కు పవన్ సూచించారు. మరి, పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates