అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి చిత్రం హిట్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో మాట్లాడిన బాలయ్య…అక్కినేని నాగేశ్వరరావు ఎస్వీ రంగారావులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్లు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అక్కినేని అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.

దీంతో, బాలకృష్ణపై అఖిల్, నాగ చైతన్యలు కూడా విమర్శలు చేశారు. అయితే, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై బాలకృష్ణ తొలిసారి మీడియా ముఖంగా స్పందించారు. తాను ఫ్లోలో అన్న మాటలకు రాద్ధాంతం చేస్తున్నారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావును తన బాబాయ్ గా భావిస్తానని అన్నారు.

తన పిల్లలకంటే నన్నే అక్కినేని ప్రేమగా చూసుకునేవారని, బాబాయి పట్ల నా గుండెల్లో ప్రేమ ఉందని అన్నారు. బయట ఎవరో ఏదో అంటుంటారని, అవన్నీ తాను పట్టించుకోనని చెప్పారు. అభిమానంతో ఎన్టీవోడని, నాగిగాడు అని పిలుస్తారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. తాను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళిపోతున్నాడ్రా అంటూ ఏదో ఒకటి అంటుంటారని, అభిమానంతోనే వారు అలా పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు.

అభిమానం ఉన్న వ్యక్తుల గురించి అలా మాట్లాడతామని, వాటిని తప్పబడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రేమ కొద్దీ అన్న మాటలను పట్టుకొని దుష్ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. తాడో పేడో అంటుంటామని, పేడో అంటే అర్థం ఏమిటని బాలయ్య ప్రశ్నించారు. మరి, ఈ వివరణ తర్వాత అయినా అక్కినేని కుటుంబ సభ్యులు, అక్కినేని అభిమానులు సైలెంట్ అవుతారా లేక బాలయ్య క్షమాపణలు చెప్పేదాకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.